చదువుకోవడానికో.. ఉద్యోగం కోసమే.. ఉపాధి కోసమో భాగ్యనగరానికి వచ్చిన వారు నగరంలో రోజురోజుకు విజృంభిస్తున్న మహమ్మారికి భయపడుతున్నారు. ఇక్కడే ఉంటే ప్రాణాలు ఉంటాయో లేదోనని సొంతూళ్లకు పయనమవుతున్నారు. కరోనా పాజిటివ్ నిర్ధరణ అయిన కొందరు కూడా ఊళ్లకు వెళ్తున్నారు.
రోగం వస్తే చూసే దిక్కులేదు..తిన్నావా..పడుకున్నావా అని అడిగే వారు లేరు..! ఆప్యాయత పంచే మనుషులు లేరు. మందులు, సరకులు తేవడానికి, వ్యాధి తీవ్ర స్థాయిలో ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్లేవారు లేక చాలా మంది కరోనా బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హోం ఐసొలేషన్ సదుపాయాలు లేక కొందరు సొంతూళ్లకు పయనమవున్నారు.
ఎల్బీనగర్‌లో ఉండే ఓ ప్రైవేటు ఉద్యోగికి కరోనా పాజిటివ్ రాగా.. ఆ రోజే తన తండ్రికి సైతం నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఆయనకి సైతం పాజిటివ్ రాగా ఏం చేయాలో పాలుపోలేదు. ఇంట్లో వారిద్దరే ఉండటంతో హోం ఐసోలేషన్‌లో వారికి సహాయం చేసేవారు లేరు. పక్కవారిని సాయం అడుగుదామన్నా...ఎలా స్పందిస్తారోనన్న ఆందోళన. ఇంటి యజమానికి తెలిస్తే ఇల్లు ఖాళీ చేయిస్తాడనే భయం...నిస్సహాయ స్థితిలో తండ్రితో పాటు ఊరెళ్లిపోయాడు. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాననే ఆలోచనే మర్చిపోయాడు.