ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పిల్లల్నీ పీడిస్తున్న కరోనా వైరస్‌ - కరోనా లక్షణాలు తాజా

కరోనా మహమ్మారి కొత్త సవాళ్లను విసురుతోంది. కొందరి పిల్లల్లో కొవిడ్‌ వైరస్‌ తొలి 14 రోజుల్లో పెద్దగా ప్రభావం చూపించకపోయినా 3, 4 వారాల్లో తీవ్రమవుతోందని తాజాగా వస్తున్న కేసులను బట్టి తెలుస్తోంది. వైరస్‌ సోకినా తొలి రెండు వారాల్లో లక్షణాలు పెద్దగా బయటపడకపోవడంతో పిల్లలు కరోనా మహమ్మారి బారిన పడిన విషయాన్ని తల్లిదండ్రులు కూడా గుర్తించలేక పోతున్నారు.

covid new symptoms on kids
covid new symptoms on kids

By

Published : Aug 27, 2020, 7:33 AM IST

నాలుగేళ్ల చిన్నారికి ఉన్నట్టుండి ఒళ్లంతా దద్దుర్లు, 102 డిగ్రీల జ్వరం వచ్చింది. సమీపంలోని వైద్యుణ్ని సంప్రదిస్తే.. టైఫాయిడ్‌ కావచ్చనే భావనతో చికిత్స ప్రారంభించారు. నాలుగు రోజులైనా తగ్గకపోగా, పాప మరింత నీరసించిపోవడంతో నిలోఫర్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పాపకు రెండుమూడు వారాల కిందట జ్వరం వచ్చిందని చెప్పడంతో కొవిడ్‌ అనే సందేహం కలిగి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇది కరోనా తీవ్రతలో భాగంగానే అని గుర్తించి చికిత్స అందించడంతో పాప కోలుకుంది.

పదేళ్ల బాలుడికి తీవ్రంగా జ్వరం వచ్చింది. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి ఉండడంతో ప్రైవేటు వైద్యుణ్ని సంప్రదించారు. ఆ కుటుంబంలో నెల రోజుల కిందట కొవిడ్‌తో ఒకరు మృతిచెందారని తెలియడంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా ప్రభావం ఆలస్యంగా చూపినట్లుగా నిర్ధారించి, అత్యవసర వైద్యమందించారు.

కరోనా మహమ్మారి కొత్త సవాళ్లను విసురుతోంది. కొందరి పిల్లల్లో కొవిడ్‌ వైరస్‌ తొలి 14 రోజుల్లో పెద్దగా ప్రభావం చూపించకపోయినా 3, 4 వారాల్లో తీవ్రమవుతోందని తాజాగా వస్తున్న కేసులను బట్టి తెలుస్తోంది. వైరస్‌ సోకినా తొలి రెండు వారాల్లో లక్షణాలు పెద్దగా బయటపడకపోవడంతో పిల్లలు కరోనా మహమ్మారి బారిన పడిన విషయాన్ని తల్లిదండ్రులు కూడా గుర్తించలేక పోతున్నారు. ఆ తర్వాత తీవ్ర జ్వరం, ఒళ్లంతా దద్దుర్లు, కడుపునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులను జాగ్రత్తగా పరీక్షిస్తే.. కొవిడ్‌కు అనుబంధంగా ఉత్పన్నమవుతున్న తీవ్ర సమస్యగా నిర్ధారణ అవుతోంది. ‘సాధారణంగా పెద్దల్లో కరోనా దుష్ప్రభావాలు రెండోవారంలో ఎక్కువగా కనిపించే అవకాశాలున్నాయి. దీనిని వైద్య పరిభాషలో సైటోకైన్స్‌ దాడి అంటాం. చాలా చిత్రంగా కొంతమంది పిల్లల్లో ఇటీవల మూడు, నాలుగు వారాల్లో ఈ తరహా దాడి వెలుగులోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది’’ అని వైద్య నిపుణుడు ఒకరు ప్రస్తుత పరిస్థితుల్ని విశ్లేషించారు.

మల్టీసిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌(ఎంఐఎస్‌) సమస్య ఎదురవుతోంది..

రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసులను పరిశీలిస్తే.. 10 ఏళ్లలోపు పిల్లలు సుమారు 4 శాతం మంది ఉన్నారు. ఈ వైరస్‌ పిల్లలను పూర్తిగా ఏమీ చేయదు అని తొలిరోజుల్లో భావించేవారు. ఇప్పుడు కొంత ముప్పు పొంచి ఉందనే అవగాహనకు వచ్చినట్లుగా వైద్యనిపుణులు చెబుతున్నారు. కొత్త వైరస్‌ కావడంతో అనుభవాలను బట్టి ఆలోచనలు కూడా మారుతున్నాయి. కరోనా సోకిన కొంత మంది చిన్నారుల్లో 15-30 రోజుల్లో తాజాగా ‘మల్టీసిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌(ఎంఐఎస్‌)’ సమస్య ఎదురవుతోందని నిపుణులు గుర్తించారు.

గాంధీ ఆసుపత్రిలోనే గత నెల రోజుల్లో దాదాపు 26 మంది చిన్నారులు ఇవే లక్షణాలతో చేరారు. ఒక ప్రైవేటు పిల్లల ఆసుపత్రిలోనూ నెలరోజుల్లో దాదాపు 21 మంది చిన్నారులు ‘ఎంఐఎస్‌’తో చికిత్స పొందడం గమనార్హం. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో సుమారు 4,400 మంది చిన్నారులు కొవిడ్‌ బారినపడగా.. వీరిలో ‘ఎంఐఎస్‌’ వ్యాధితో ఇబ్బందిపడిన వారి సంఖ్య స్వల్పమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే సత్వరమే గుర్తించి చికిత్స అందించకపోతే.. ఈ జబ్బు ప్రాణాంతకంగా కూడా మారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ‘‘కొవిడ్‌కు అనుబంధంగా ఈ తరహా లక్షణాలు కనిపించడం కొత్త కావడంతో.. కొందరు వైద్యనిపుణుల్లోనూ అవగాహన లేక.. ఇతర వ్యాధులనుకొని వాటికి చికిత్స అందిస్తున్నారు. మూణ్నాలుగు వారాల కిందట కొవిడ్‌ లక్షణాలు స్వల్పంగా వచ్చి వెళ్లినా సరే.. కొన్ని తీవ్ర లక్షణాలు గుర్తించినప్పుడు వాటిని తేలిగ్గా తీసుకోవద్దు’ అని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘పిల్లలకు వైరస్‌ సోకినా లక్షణాలు పెద్దగా బయటపడకపోవడంతో.. జ్వరం, దద్దుర్లు వంటివి వచ్చినప్పుడు కొవిడ్‌కు సంబంధించినది అని అనుకునే అవకాశాలు చాలా తక్కువ. ఇది సాధారణమే అనే భావనతో తల్లిదండ్రులు కొంత ఉదాసీనంగా ఉండే ప్రమాదమూ ఉంది. అవగాహన పెంచుకొని అప్రమత్తతతో మెలగాలి’ అని చెబుతున్నారు.

నిర్ధారణ పరీక్షలు

డీ డైమర్‌, ఐఎల్‌ 6, సీబీపీ, సీఆర్‌పీ, ఫెర్రిటిన్‌, ఎక్స్‌రే, 2 డి ఎకో. (వీటిలో అవసరాన్ని బట్టి పరీక్షలు చేయాల్సి ఉంటుంది.)

సత్వర చికిత్సతో కోలుకుంటున్నారు

కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత 0-21 ఏళ్లలోపు వారిలో ప్రత్యేక లక్షణాలు కనిపిస్తున్నాయి. సరైన సమయంలో చికిత్స అందిస్తే పూర్తిగా కోలుకుంటున్నారు. అయితే ఇది కొవిడ్‌ అనుబంధమా అనేది గుర్తించడం కష్టమవుతోంది. ఎందుకంటే ము ఖ్యంగా కొంతమంది పిల్లల్లో స్వల్పంగా జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఒకట్రెండు రోజులుండి తగ్గిపోతుంటాయి. ఇలాంటి వారిలో ఒళ్లంతా దద్దుర్లు, వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలున్నప్పుడు సందేహం కలుగుతోంది. అప్పుడు ‘కనీసం 2-3 వారాల కిందట కరోనా లక్షణాలు ఏమైనా కనిపించాయా?’ అని మరీ మరీ అడిగితే గానీ.. తల్లిదండ్రులు గుర్తుచేసుకొని చెప్పడం లేదు. కానీ రక్త పరీక్షల్లో కరోనా తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. తీవ్ర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసేవలు పొందడం తప్పనిసరి. - డాక్టర్‌ సతీశ్‌ ఘంటా, పిల్లల వైద్యనిపుణులు, లిటిర్‌ స్టార్స్‌ హాస్పిటల్‌

జాప్యం చేయొద్దు

పిల్లల్లో కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉంది. వచ్చినా భయపడక్కర్లేదు. కోలుకునే అవకాశాలెక్కువ. ప్రభుత్వ వైద్యంలో అన్ని రకాల వసతులున్నాయి. ఇక్కడికొచ్చే చిన్నారులకు కొవిడ్‌ లక్షణాలుంటే అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నాం. పరిస్థితి తీవ్రతను బట్టి గాంధీ ఆసుపత్రికి పంపిస్తున్నాం. కొందరు పిల్లల్లో మూడో వారం తర్వాత లక్షణాలు కనిపించడమే కొత్త విషయం. ఇప్పుడిప్పుడే దీనిపై అవగాహన పెరుగుతోంది. ఎటువంటి లక్షణాలు కనిపించినా.. చికిత్స పొందడంలో జాప్యం చేయొద్దు. - డా. నరహరి, పిల్లల వైద్యనిపుణులు, నిలోఫర్‌

ఇదీ చదవండి:తెలుగునాట వినోదాల వీచిక.. 'ఈటీవీ' రజతోత్సవ వేడుక

ABOUT THE AUTHOR

...view details