కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.. సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు చేయించాలని.. మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేయాలని సూచించారు. సచివాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో ఈ విషయమై చర్చించారు.
బీసీ హాస్టళ్లలో భోజన వసతి ఏర్పాట్లు, నాణ్యమైన భోజనం.. కల్పించాల్సిందిగా సూచించారు. బీసీ వసతి గృహాల్లో మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుధ్ధ్యం లాంటి అంశాల్లో మెరుగైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దేశంలోనే అత్యుత్తమంగా బీసీ హాస్టళ్లను నిర్వహించి.. మార్గదర్శకంగా మారాలన్నారు.