కొవిడ్ మొదటి ఉద్ధృతిని తట్టుకుని హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ నిలబడింది. లాక్‌డౌన్, ధరణి కోసం రిజిస్ట్రేషన్ల నిలుపుదల వంటి సవాళ్లను తట్టుకుని అంతేవేగంగా కొవిడ్ ముందునాటి స్థాయికి చేరుకుంది. క్రితం సంవత్సరం చివరి త్రైమాసికం, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల బుకింగ్స్ ఆయా సంస్థలనే ఆశ్చర్యపర్చేలా అత్యుత్తమ విక్రయాలను నమోదు చేశాయి. ఇదే దూకుడుతో పలు నిర్మాణ సంస్థలు పెద్ద ఎత్తున కొత్త ప్రాజెక్టులను ప్రకటించాయి. విక్రయాలను సైతం మొదలెట్టాయి. బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్న దశలో రెండో ఉద్ధృతి మొదలైంది. క్రితం ఆదివారం వరకు ప్రాజెక్టులను సందర్శనకు కొనుగోలుదారులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.
కొంపల్లిలోని ఒక ప్రాజెక్టులో ఆదివారం ఒక్కరోజే 32 కుటుంబాలు సందర్శించాయని బిల్డర్ ఒకరు తెలిపారు. కొవిడ్ జాగ్రత్తలతో ప్రాజెక్టు గురించి తమ సిబ్బంది వివరించారని.. వీటిలో కొన్ని బుకింగ్స్ కూడా అయ్యాయని చెప్పారు. ఈ ఆదివారం ఎలా ఉంటుందో చూడాలని సదరు బిల్డరు అన్నారు. ‘రాత్రి కర్ఫ్యూ ప్రభావం నిర్మాణ పనులపై పెద్దగా ఏమి లేదు. తమ సైట్లలో కూలీలు రాత్రి కూడా పని చేస్తున్నారు. లాక్‌డౌన్ భయాలతో సొంతూర్లకు తమ సైట్ల నుంచి కూలీలు ఎవరూ తిరిగి వెళ్లలేదు. అలాంటి భయాలు కన్పించట్లేదు. దాదాపు 6వేల మంది ఇక్కడ పనిచేస్తున్నారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మే 1 తర్వాత అందరికీ టీకాలు వేయించబోతున్నాం’ అని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ డైరెక్టర్ తెలిపారు. మరో ప్రముఖ సంస్థ ప్రతినిధి ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు.
అక్కడక్కడ కొన్ని సైట్లలో కూలీలు తిరిగి వెళ్లడం కన్పించిందని.. తమ ప్రాజెక్టుల్లో పనిచేసే వారెవరూ వెళ్లలేదని తెలిపారు. మున్ముందు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేకున్నాం అని అన్నారు. ఉద్ధృతి ఇలాగే కొనసాగితే నిర్మాణ పనులపై కచ్చితంగా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. పెద్ద సంస్థలు ముందే అప్రమత్తమై ప్రత్యామ్నాయ వ్యాపార ప్రణాళికలతో మార్కెట్ లీడర్‌ను అన్పించుకుంటున్నాయి. వర్చువల్ రియాలిటీ, త్రిడీ సాంకేతికతను వినియోగిస్తూ ఆన్‌లైన్‌లోనే ప్రాజెక్టు సందర్శన పూర్తి చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనే బుకింగ్స్‌ను స్వీకరిస్తున్నాయి. కొనుగోలుదారుల నుంచి స్పందన సానుకూలంగా ఉందని సదరు సంస్థ ప్రతినిధి తెలిపారు.
సర్వే అద్దం పట్టింది..
రెండో ఉద్ధృతి నేపథ్యంలో నైట్‌ఫ్రాంక్ ఇండియా, ఫిక్కి, నరెడ్కో సంస్థలు రియల్ ఎస్టేట్ భాగస్వాములతో కలిసి సర్వే నిర్వహించింది. వచ్చే ఆరు నెలల కాలానికి భవిష్యత్తు సెంటిమెంట్ స్కోరు 64 నుంచి 57కి తగ్గింది. దక్షిణాదిలో చూస్తే 63 స్కోరుతో రియల్ ఎస్టేట్‌పై విశ్వాసం తగ్గలేదనే అభిప్రాయం వెల్లడైంది. సెంటిమెంట్ స్కోరు తగ్గడానికి రెండో ఉద్ధృతి ప్రబలంగా ఉండటంతో మార్కెట్ అనిశ్చితికి సర్వే అద్దం పడుతోందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్(నరెడ్కో) జాతీయ అధ్యక్షుడు నిరంజన్ హిరానందాని అన్నారు. రవాణా ఆటంకాలు లేకపోతే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి పెద్దగా ఇబ్బందులుండవన్నారు. ఆహారం, ఆశ్రయంతో పాటు కూలీల్లో భరోసా నింపడంతో పాటు వారి భద్రతకు పూర్తి చర్యలు, టీకా ఏర్పాట్లతో పనులు ఆగకుండా చూసుకోవచ్చు అన్నారు. అమ్మకాలపై ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయ డిజిటల్ బాటలో నిర్మాణ సంస్థలు దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్నారు. వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశ్రమ అందిపుచ్చుకోవడం ద్వారా దీర్ఘకాలంలో సానుకూల వృద్ధికి దోహదం చేస్తుందన్నారు.