రాష్ట్రంలోని 594 కొవిడ్ ఆసుపత్రుల నుంచి నిత్యం సగటున 38 మెట్రిక్ టన్నుల బయో మెడికల్ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. వీటి సేకరణ, రవాణా, శాస్త్రీయ నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పీసీబీ ఛైర్మన్ ఏకే పరీడా ఓ ప్రకటనలో తెలిపారు. కొవిడ్ పరీక్షలు, చికిత్సలు నిర్వహించే అన్ని ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, క్వారంటైన్ కేంద్రాలు, రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు.. తప్పనిసరిగా తమ వివరాలను యాప్‌లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 12 ఉమ్మడి బయో మెడికల్ వ్యర్థాల శుద్ధి కేంద్రాలకు వ్యర్థాలు రవాణా చేసే వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. ఆయా కేంద్రాల వద్ద వాయు కాలుష్యం పెరగకుండా వాయు నాణ్యతను గమనిస్తున్నామన్నారు.
కీలక సూచనలు:
* ఇంటి వద్ద చికిత్స పొందే కొవిడ్ రోగులు వారికి సంబంధించిన బయో మెడికల్ వ్యర్థాలను ప్రత్యేకంగా పసుపు సంచిలో వేసి సంబంధిత పురపాలక లేదా పంచాయతీ సిబ్బందికి అందజేయాలి. వాటిని వారు శుద్ధి కేంద్రాలకు పంపుతారు.
* కొవిడ్ రోగులు వాడేసిన మాస్కులు, గ్లవ్స్, టిష్యూలు, కొవిడ్ రోగుల రక్తం లేదా శరీర ద్రవాలు అంటిన స్వాబ్స్, సిరంజులు, మందులు తదితరాలను బయో మెడికల్ వ్యర్థాలుగానే పరిగణించాలి.