తెలంగాణలో కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 5 వేలకు చేరువైంది. ఈ నెలలో కేవలం 14 రోజుల్లోనే 2,276 కేసులు వచ్చాయి. ఆదివారం మరో 237 పాజిటివ్ కేసులతో కలిపి ఈ సంఖ్య 4,974కు చేరుకుంది. జీహెచ్‌ఎంసీలోనే రికార్డు స్థాయిలో 195 కేసులు ఉన్నాయి. ఆదివారం మరో ఎమ్మెల్యేతో పాటు అధికారులు, పోలీసులు, జర్నలిస్టులు, ప్రజలు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి పాజిటివ్ రాగా.. ఆదివారం నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కూ కొవిడ్ వైరస్ సోకినట్టు వెల్లడైంది. ఈ క్రమంలో కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరుకుంది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వద్ద పనిచేసే ఓ ప్రత్యేక అధికారికి (ఓఎస్డీకి) కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల్లో ఈనెలలో వచ్చిన కేసులు 45.75 శాతంగా ఉన్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది, జర్నలిస్టులు, పోలీసులు కరోనా వైరస్ ప్రభావానికి అధికంగా గురవుతున్నారు. ఇప్పటికే 140 మందికి పైగా పోలీసులు కరోనా బారిన పడ్డారు.
23 మంది జర్నలిస్టులకు కూడా...
కరోనాతో ఇటీవల ఒక జర్నలిస్టు మరణించిన తరువాత ఇప్పటి వరకు విడతల వారీగా 140 మంది స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో కొందరికి ఇప్పటికే పాజిటివ్ వచ్చింది. శనివారం 56 మంది పరీక్షలు చేయించుకోగా... ఆదివారం వెల్లడైన ఫలితాల్లో మరో 23 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. తాత్కాలిక సచివాలయం బీఆర్‌కే భవన్‌లోని రెండోఅంతస్తులో పనిచేస్తున్న ఐటీశాఖ సర్వర్ల విభాగంలోని ఉద్యోగినికి పాజిటివ్ సోకింది.
ఆ జిల్లాల్లోనూ తీవ్రత..
జీహెచ్‌ఎంసీలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం అత్యధికంగా రికార్డు స్థాయిలో 195 పాజిటివ్ కేసులు వచ్చాయి. . జీహెచ్‌ఎంసీ చుట్టూ జిల్లాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో కేసుల తీవ్రత అధికమవుతోంది. కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం మరో ముగ్గురు చనిపోయారు. చికిత్స నుంచి కోలుకుని 25 మంది డిశ్ఛార్జి అయ్యారు. 2,412 మంది చికిత్స పొందుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధుల వ్యక్తిగత, భద్రతా సిబ్బందికీ కరోనా సోకడంతో వారింటికే పరిమితమయ్యారు.