తెలంగాణ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన రవికుమార్... బీఈడీ పూర్తి చేసి నాలుగేళ్లుగా పెద్దవూర మండలం తుమ్మచెట్టు వద్ద గల ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కొవిడ్ వల్ల గతేడాది మార్చి నుంచి బడి మూతపడటంతో... ఇంటికే పరిమితమయ్యాడు. సైకిల్ మెకానిక్‌గా పనిచేసే తండ్రి శ్రీనివాస్‌కు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. కానీ కుటుంబం గడవక... భార్య, పిల్లల్ని పోషించే స్థోమత లేక... అలిగి వెళ్లిపోయిన సతీమణి ఏమైందోనన్న ఆవేదనతో... యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు..
2011లో వివాహమైన రవి, అక్కమ్మ దంపతులకు.... ఆరేళ్ల కుమారుడు సందేశ్, నాలుగేళ్ల కుమార్తె సాక్షి ఉన్నారు. సైకిల్ మెకానిక్ ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉండటం... అద్దె ఇంట్లోనే నెట్టుకురావడం వంటి సమస్యలు ఆ కుటుంబాన్ని సతమతం చేశాయి. అంతంత మాత్రంగా ఉన్న ఆదాయం... తల్లిదండ్రుల్లో అసంతృప్తి, సతీమణితో మనస్పర్దలకు దారి తీసింది. భార్య ఇంట్లోంచి వెళ్లిపోయి సాగర్ కుడి కాల్వలో దూకింది. కట్టుకున్న భార్య కనబడక అతనూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. రవి అంత్యక్రియల రోజే....గుంటూరు జిల్లా మాచర్ల సమీపంలో బుగ్గ వాగు వద్ద అక్కమ్మ మృతదేహం లభ్యమైంది.