ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Couple Dead: కుమార్తె జన్మదిన వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. దంపతులు మృతి - ts news

Couple Died in Road Accident: హాస్టల్​లో ఉంటున్న తమ కూతురు జన్మదిన వేడుకలు నిర్వహించడానికి హైదరాబాద్​కు వెళ్లారు. తమ బిడ్డతో ఆనందంగా గడిపారు. తిరిగి వచ్చే క్రమంలో రోడ్డుప్రమాదం ఆ దంపతులను కబలించింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ సమీపంలో చోటు చేసుకుంది.

Couple Died in Road Accident
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

By

Published : Apr 28, 2022, 12:31 PM IST

Couple Died in Road Accident: తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రజ్ఞాపూర్‌ రాజీవ్‌ రహదారిపై రాణె ఫ్యాక్టరీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. గజ్వేల్‌ సీఐ వీర ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్‌ పట్టణానికి చెందిన జగ్గయ్యగారి శ్రీధర్‌ (42), జలజ (40) దంపతుల కుమార్తె హైదరాబాద్‌లో చదువుతూ హాస్టల్‌లో ఉంటుంది. దంపతులు బుధవారం సాయంత్రం తమ కిరాణా దుకాణాన్ని మూసేసి హైదరాబాద్‌లో చదువుకుంటున్న తమ కుమార్తె వద్దకు వెళ్లారు. బుధవారం బిడ్డ జన్మదినం కావటంతో దంపతులిద్దరూ హాస్టల్‌లో వేడుకలు జరిపారు.

హాస్టల్‌లో కుమార్తె జన్మదిన వేడుకలను పూర్తి చేసుకుని తిరిగి గజ్వేల్‌కు వస్తుండగా ప్రజ్ఞాపూర్‌ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో వాహనం పల్టీ కొట్టి కుడివైపునకు పడిపోయింది. అదే సమయంలో హైదరాబాద్‌ వైపు వస్తున్న మరో కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మరోకారులో వెళ్తున్న ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను గజ్వేల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మృతితో గజ్వేల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details