2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ పత్తిని కొనుగోలు చేసేందుకు 43 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-(సీసీఐ) ఏర్పాటు చేసిన కేంద్రాలు సహా... మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకే కొనుగోళ్లు జరుగుతాయని స్పష్టం చేసింది.
ప్రయోగాత్మకంగా నాలుగు జిల్లాల్లో అమలు
పత్తి కోనుగోలుకు 43 కేంద్రాలు..మార్గదర్శకాలు విడుదలు ప్రయోగాత్మకంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో... కలెక్టర్లు నోటిఫై చేసిన ప్రాంతాల్లో కొనుగోళ్లు జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఇ-పంట, ఇ-క్రాప్ ద్వారా నమోదైన వివరాలను సరి చూసుకోవటంతో పాటు.... రైతుల పంట సాగు ధ్రువీకరణ పత్రాన్ని కూడా తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. పత్తి కొనుగోళ్లు జరిపే నాలుగు జిల్లాల్లోనూ మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లులు రైతులకు అత్యంత సమీపంలోనే ఉండేలా చూడాలని సూచించింది. తద్వారా రైతులకు రవాణా ఖర్చులు తగ్గుతాయని ప్రభుత్వం పేర్కొంది.
జిల్లా సంయుక్త పాలనాధికారులు ఛైర్మన్గా, అదనపు ఎస్పీ, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి, సీసీఐ, రవాణాశాఖ ఉప కమిషనర్లు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు సభ్యులుగా ఉన్న జిల్లా స్థాయి కమిటీలు పత్తి కొనుగోళ్లను పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.