తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మల్లాపూర్ డివిజన్ అన్నపూర్ణ కాలనీకి చెందిన ఓ వ్యక్తి(60) తీవ్రజ్వరంతో బాధపడుతూ ఈనెల 6న ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చేరారు. రెండురోజుల చికిత్స తర్వాత(8వ తేదీన) కొవిడ్ పాజిటివ్ అని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
ఆ తర్వాత 15 నిమిషాలకే చనిపోయాడని మళ్లీ ఫోన్ చేసి చెప్పారు. నాచారం పోలీస్ ఠాణా నుంచి సిబ్బందిని తీసుకొస్తే మృతదేహాన్ని అప్పగిస్తామన్నారు. అప్పటికే కొందరు సిబ్బందికి కరోనా సోకడం, విధుల్లో తక్కువమందే ఉండటంతో వెళ్లేందుకు జాప్యం జరిగింది. చివరికి ఆరు రోజుల తర్వాత ఈనెల 14న దుండిగల్‌లోని ఓ శ్మశానవాటికలో ముగ్గురు సమీప బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఆ ఇంటివైపు చూడలేదు
ఈనెల 9న మృతుని తల్లి(85), భార్య(55), కుమారుడు(24) అమీర్‌పేటలోని కొవిడ్ పరీక్షా కేంద్రంలో పరీక్షలు చేయించుకున్నారు. వారికీ పాజిటివ్ ఉన్నట్లు 14న కొవిడ్ కంట్రోల్ కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. అప్పటికే వృద్ధురాలికి తీవ్ర అస్వస్థత ఉండటంతో గాంధీకి తరలించగా ఆదివారం ఆమె మరణించారు.
మిగతా ఇద్దరు బాధితులు ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారు. ఒకే కుటుంబంలో ఇంత విషాదమున్నా స్థానికంగా వైద్యశాఖ, బల్దియా అధికారులు ఆ ఇంటివైపు చూడలేదు.. ప్రభుత్వమిస్తున్న కొవిడ్ కిట్ సైతం అందించలేదు. వృద్ధురాలి అంత్యక్రియలపైనా ఇప్పుడు సందిగ్ధం నెలకొంది.
ఇదీ చదవండి:నరకయాతన: అద్దె ఇళ్లలో ఉండనివ్వరు.. దవాఖానాల్లో చేర్చుకోరు!