కరోనా వైరస్ నిర్ధారిత యువకుడు దుబాయి నుంచి వచ్చిన తర్వాత రెండు రోజుల పాటు బెంగళూరులో ఉద్యోగానికి వెళ్లాడు. అక్కడ ఎవరెవర్ని కలిశాడు? సన్నిహితంగా మెలిగిన సహచరులెవరు? వీరిలో తెలంగాణకు చెందినవారెవరైనా ఉన్నారా? అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానాల్లేవు.
యువకుడు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బస్సులో 27 మంది ప్రయాణికులున్నట్లుగా గుర్తించారు. అది ఏసీ బస్సు కాబట్టి వైరస్ త్వరగా వ్యాప్తిచెందే అవకాశాలున్నాయి. ఇప్పుడా 27 మందిని గుర్తించిన వైద్య యంత్రాంగం.. వారందరికీ గాంధీలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లుచేసింది. వీరు కాకుండా బాధితుడి కుటుంబ సభ్యులు, మిత్రులు మరో 11 మంది. వీరిని అత్యవసరంగా గాంధీకి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
42 మంది అనుమానితులు..
ఈ రెండు గ్రూపులు కాకుండా సికింద్రాబాద్ అపోలోలో చికిత్స చేసిన వైద్యబృందంలోనూ 42 మందిని అనుమానితులుగా గుర్తించారు. అపోలో ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ అనుమానంతో చికిత్స చేయడం కూడా కొంత వరకూ వైరస్ వ్యాప్తిని అడ్డుకున్నట్లు అవుతుందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే స్వైన్‌ఫ్లూ చికిత్సలో భాగంగా ఈ యువకుడిని విడి గదిలో ఉంచి చికిత్స చేశారు.
అయితే ఈ చికిత్సలో ప్రత్యక్షంగా పాల్గొన్న వైద్యుడికి కరోనా వైరస్ సోకే అవకాశాలున్నాయనే భావనతో వైద్యసిబ్బంది ఆయనను అత్యవసరంగా గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది.
80 మంది సన్నిహితులు..
మొత్తంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు, ఆసుపత్రి సిబ్బందితో పాటు 80 మందిపైగానే సన్నిహితంగా మెలిగినట్లుగా వైద్యఆరోగ్యశాఖ గుర్తించింది. వీరందరికీ కచ్చితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది.
అయితే బాధిత యువకుడితో సన్నిహితంగా మెలిగిన ఈ 80 మంది గత రెండువారాలుగా ఎవరెవరితో కలిశారు? ఎక్కడెక్కడికి వెళ్లారనేది కూడా ఇప్పుడు ముఖ్యమైన అంశమే. పరీక్షల్లో వైరస్ లేదని తేలినా కూడా ఈ 80 మందిని మరో రెండువారాల పాటు వారి ఇళ్లలోనే విడి గదుల్లో ఉండేలా ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంది.
రెండు నుంచి మూడుకు..
కరోనా వైరస్ కేరళలో తొలిసారి వెలుగులోకి వచ్చిన ముగ్గురూ చైనా నుంచి నేరుగా వచ్చినవారే. అయితే ఇప్పుడు తెలంగాణలో నమోదైన కేసు ఇందుకు భిన్నం. హాంకాంగ్‌లో కరోనా సోకిన వ్యక్తి ద్వారా ఈ యువకుడికి సోకినట్లుగా అనుమానాలున్నాయి. అంటే ఇది నేరుగా కాకుండా మరో వ్యక్తి (సెకండ్ కాంటాక్ట్) ద్వారా వ్యాపించిందని తెలుస్తోంది.