ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అద్దె ఇళ్లలో ఉండనివ్వరు.. ఆసుపత్రుల్లో చేర్చుకోరు! - హైదరాబాద్ కరోనా వార్తలు

హైదరాబాద్‌ నగరంలో అద్దెకు ఉంటున్నవారిలో కరోనా పాజిటివ్‌గా తేలుతున్న బాధితులకు హోం ఐసోలేషన్‌ పరంగా ఇబ్బందులు తప్పడం లేదు. చుట్టుపక్కల జనం ఏమనుకుంటారోననే భయం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం వారికి శాపంగా మారుతోంది. అటు అద్దె ఇంటికి వెళ్లలేక, ఇటు ఆసుపత్రుల్లో చేర్చుకోక.. దొరికిన చోట తలదాచుకుంటున్నారు. బాధితులను పట్టించుకోకపోవడం ఇతరులను ప్రమాదంలోకి నెడుతోంది.

corona-virus-victims-facing-trouble-for-home-isolation-staying-in-rental-homes-in-hyderabad
corona-virus-victims-facing-trouble-for-home-isolation-staying-in-rental-homes-in-hyderabad

By

Published : Jul 20, 2020, 9:56 AM IST

  • ఓ ప్రైవేట్‌ ఉద్యోగి(26) ముగ్గురు మిత్రులతో కలిసి హైదరాబాద్‌లో అద్దెకుంటున్నాడు. తాజాగా అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మిగతా ముగ్గురికి నెగిటివ్‌ వచ్చింది. అద్దె ఇంటికి యజమాని ఎక్కడ రానివ్వడనే భయంతో రాత్రంతా ఇంటి మెట్ల దగ్గరే పడుకున్నాడు. దాదాపు 24 గంటల తర్వాత హోం ఐసోలేషన్‌కి వెళ్లాడు.
  • దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి(30)కి శుక్రవారం మధ్యాహ్నం పాజిటివ్‌ వచ్చింది. అద్దె ఇంటి యజమాని గది ఖాళీ చేయాలని బలవంతం చేశాడు. దీనివల్ల రాత్రి వరకు స్థానిక మెట్రో కేంద్రం వద్దే నిరీక్షించాడు. చివరకు ఓ స్నేహితుడి గదికి వెళ్లాడు. ఇది ఈ ఇద్దరి పరిస్థితే కాదు. నగరంలో అద్దెకుంటూ కొవిడ్‌ పాజిటివ్‌గా తేలుతున్న అనేకమంది ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు.

ర్యాపిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలగానే హోం ఐసోలేషన్‌ సౌకర్యం ఉన్నవారు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. అద్దె గదుల్లో ఉంటున్నవారు ఎక్కడికి వెళ్లాలో తెలియని సందిగ్ధంలో ఉండిపోతున్నారు. స్థానిక జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ శాఖకు తెలిస్తే ఎక్కడ ఇంటికి కంటెయిన్‌మెంట్‌ జోన్‌ బోర్డు పెడతారోననే భయంతో చిరునామా చెప్పేందుకూ నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఆసుపత్రికి వెళ్లేందుకు 108, 104లకు ఫోన్‌ చేస్తే.. ‘మీ దగ్గర పీహెచ్‌సీ ధ్రువీకరించిన పత్రం ఉంటేనే వస్తాం. ఏ ఆసుపత్రికి వెళ్తారో నిర్ధారించుకుని చెప్పాలి’ అంటూ చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తున్నారు. తీరా ఆసుపత్రులకు వెళ్తే ఇంట్లోనే ఉండండని తిప్పి పంపిస్తున్నారు. ఏ ఆసుపత్రికి వెళ్లాలో కూడా సరైన సమాచారం కరవవుతోంది.

కనికరం లేకుండా...

పాజిటివ్‌ వచ్చినా తీవ్ర లక్షణాలు లేకుంటే ఇంటినుంచే కోలుకునే వీలుంది. నగరంలో కరోనా బారిన పడుతున్న వారిలో దాదాపు 70 శాతం ఇళ్లనుంచే స్వీయ జాగ్రత్తలతో కోలుకుంటున్నారు. అయితే కొందరు అద్దె ఇళ్ల యజమానులు మాత్రం పాజిటివ్‌ వచ్చిన వెంటనే ఖాళీ చేయాలని బాధితుల్ని బలవంతం చేస్తున్నారు. కనికరం చూపకుండా వారిపై ఆగ్రహం, అసహనం ప్రదర్శిస్తున్నారు. ఈ భయంతోనే బాధితులు అసలు విషయం చెప్పకుండా తిరిగేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కూడా చిరునామాలు సరిగా ఇవ్వడంలేదు. దీనివల్ల వైద్య, జీహెచ్‌ఎంసీ శాఖల సిబ్బంది వారిని సంప్రదించే వీలు లేకుండాపోతోంది.

ఇదీ చదవండి

డిసెంబరు కల్లా కొవిడ్​-19 వ్యాక్సిన్‌!

ABOUT THE AUTHOR

...view details