ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పటాకుల పొగతో సాధారణం కంటే వేగంగా కరోనా వైరస్​ వ్యాప్తి - దివాళితో ఇండియాలో కరోనా సెకండ్​ వేవే

అసలే కొవిడ్‌ ఉద్ధృతి.. అందులోనూ చలికాలం.. దీనికితోడు దీపావళి వేళ పటాకుల కాలుష్యం.. మామూలుగానే అతి వేగంగా వ్యాప్తి చెందే గుణమున్న కరోనా వైరస్‌.. ఈ సమయంలో సాధారణం కంటే మరింత విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

corona virus spreads faster than usual with fireworks smoke
పటాకుల పొగతో సాధారణం కంటే వేగంగా కరోనా వైరస్​ వ్యాప్తి

By

Published : Nov 9, 2020, 9:08 AM IST

ఈ దీపావళి పండుగ సమయాన తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలుష్యాన్ని వాహకంగా చేసుకొని కరోనా వైరస్​ శ్వాసకోశాలపై తీవ్ర దాడికి తెగబడే ప్రమాదముందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాణసంచా పొగతో పాటు వైరస్‌ శ్వాసకోశాల్లోకి చేరితే ముప్పు తీవ్రత అధికంగా ఉంటుందనీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగానే ఇప్పటికే దిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో బాణసంచా అమ్మకాలపై నిషేధం విధించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, శ్వాస సంబంధమైన సమస్యలు ఉన్నవారు బాణసంచా పొగకు ఎంత దూరంగా ఉంటే.. అంత మేలని నిపుణులు సూచిస్తున్నారు.

విస్తృత వ్యాప్తికి అనుకూలం

మామూలుగానే పటాకుల కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఏటా దీపావళి అనంతరం కాలుష్యం కొన్ని రెట్లు పెరిగిపోవడం తెలిసిందే. ప్రస్తుతం కొవిడ్‌ బారినపడి కోలుకున్నవారిపైనా, ఎటువంటి లక్షణాల్లేని కరోనా బాధితులపైనా చలి, కాలుష్యం దుష్ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఈనెల 11 నాటికి మొత్తం 2,50,331 మంది కొవిడ్‌ బారినపడ్డారు. ప్రస్తుతం 19,890 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 17,135 (86.14 శాతం) మంది ఐసొలేషన్‌లో వైద్యసేవల్లో ఉన్నారు. ఇలాంటివారందరికీ బాణసంచా పొగ వల్ల తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమెరికా, బ్రిటన్‌, ఇటలీల్లో అధ్యయనాలు

ఇటలీలో తొలిదశ ఉద్ధృతిలో ఎక్కువమంది కొవిడ్‌ బాధితులు మృతిచెందారు. దీనిపై నిపుణులు అధ్యయనం చేసి మధ్య, దక్షిణ ఇటలీలో కంటే ఉత్తర ఇటలీలో ఎక్కువ మరణాలు సంభవించాయని ముఖ్యంగా కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని తేల్చారు. ఏళ్ల తరబడి కాలుష్య ప్రభావానికి గురి కావడం వల్ల.. ముక్కులో కాలుష్య కారకాలను నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో కాలుష్యం నేరుగా శరీరంలోకి చేరి రక్తనాళాల్లో వాపు పెరుగుతుంది. దానికి కొవిడ్‌ను జతచేరడంతో ముప్పు మరింత పెరిగి మరణాలకు దారితీసిందని తేల్చారు.

అమెరికాలోనూ దీనిపై పెద్ద అధ్యయనమే జరిగింది. న్యూయార్క్‌ నగరంలో ఎక్కువమంది చనిపోయారు. ఇక్కడ జనసాంద్రత ఎక్కువ. కాలుష్య తీవ్రతను గుర్తించే ‘అతిసూక్ష్మ ప్రమాదకర ధూళికణాలు (సస్పెండెడ్‌ పార్టిక్యులేట్‌ మ్యాటర్‌-ఎస్‌పీఎం- 2.5) గనుక ఒక నానో క్యూబిక్‌ మీటర్‌కు ఒక మైక్రోగ్రామ్‌ పెరిగితే.. మరణాల రేటు 8 శాతం పెరుగుతుందనీ, అలాగే గాలి నాణ్యత ప్రమాణాలు కనిష్ఠానికి పడిపోయిన చోట కొవిడ్‌ మరణాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనకర్తలు విశ్లేషించారు. బ్రిటన్‌ పరిశోధకులు చేసిన అధ్యయనంలోనూ కాలుష్యం కారణంగా కొవిడ్‌ తీవ్రత పెరుగుతోందని స్పష్టంచేశారు.

గతేడాది తీవ్రత

  • మన దేశంలో దీపావళికి ముందు.. తర్వాత కాలుష్యం తీవ్రతపై ఇప్పటికే పలు అధ్యయనాలు జరిగాయి. బాణసంచా కాల్చిన తర్వాత సూక్ష్మ ధూళికణాలు, అతి సూక్ష్మ ధూళికణాలు 30-40 రెట్లు అధికంగా పెరుగుతున్నట్లు గుర్తించారు. దీపావళి రాకముందే.. దిల్లీలో ఇటీవల మళ్లీ కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడానికి అక్కడి తీవ్ర కాలుష్యమూ ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.
  • గతేడాది హైదరాబాద్‌లో దీపావళి అనంతరం కాలుష్య తీవ్రతను ప్రభుత్వం వెల్లడించింది. 2019లో సూక్ష్మ ప్రమాదకర ధూళి కణాలు (పీఎం) సగటున ఒక క్యూబిక్‌ మీటరు గాలిలో 85 మైక్రోగ్రామ్‌లు నమోదయ్యాయి. దీపావళి రోజున అవి దాదాపు రెండింతలయ్యాయి. అతి సూక్ష్మ ప్రమాదకర ధూళికణాలు (ఎస్‌పీఎం) కూడా సాధారణ రోజుల్లో కంటే దీపావళి రోజుల్లో దాదాపు మూడింతలు పెరగడం గమనార్హం.
  • గాలిలో నాణ్యత సూచి (ఏక్యూఐ) 0-50 పాయింట్లు ఉంటే అది స్వచ్ఛమైన గాలిగా పరిగణిస్తారు. 51-100 ఉంటే సంతృప్తికరంగా.. 101-200లో ఉంటే మధ్యస్థంగా.. 201-300 వరకూ ఉంటే బాగోలేన్నట్లుగా.. 301-400 వరకూ అస్సలు బాగోలేనట్లుగా.. 401-500 వరకూ ఉంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లుగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది.
  • గతేడాది దీపావళి రోజుల్లో సనత్‌నగర్‌లో 361గా నమోదుకాగా.. బొల్లారంలో 300, కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రాంతంలో 170గా నమోదైంది. ఈసారి కొవిడ్‌ విజృంభిస్తున్న పరిస్థితుల్లో పటాకులు కాల్చడం వల్ల గాలి నాణ్యత తగ్గి, అతి సూక్ష్మ ప్రమాదకర ధూళికణాలు పెరిగి.. ప్రజారోగ్యానికి పెనుముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి:

వైద్యుడు మనిషి రూపంలో ఉన్న దేవుడు: ఈటల

ABOUT THE AUTHOR

...view details