ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సంస్థలు హైదరాబాద్లో కరోనా వ్యాప్తిపై సంయుక్త పరిశోధన చేశాయి. ఈ పరిశీలనలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
మురుగునీటి నమూనాలపై వీరు జరిపిన సంయుక్త పరిశోధనల్లో... నగరంలో ఇప్పటివరకు 6.6 లక్షల మందికి కరోనా సోకిందని... వారు 35 రోజుల్లో సాధారణ స్థితికి వచ్చి ఉంటారని తేలింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఇంచుమించు సమానంగా ఉందని వెల్లడైంది. లక్షణాలు లేకుండానే ఎక్కువమంది దీని బారిన పడుతుండటంతో తాజా అధ్యయనం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
మురుగునీటిలో శాంపిల్స్ సేకరిస్తున్న సిబ్బంది సాంక్రమిక వ్యాధుల వ్యాప్తిని అర్థం చేసుకునేందుకు అనుసరించే పద్ధతుల్లో మురుగునీటి నమూనాలను పరీక్షించడం కూడా ఒకటి. సాధారణంగా కరోనా సోకినవారి నాసికా స్రావాలు, నోటి తుంపర్ల నుంచే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారానూ వైరస్ బహిర్గతమవుతుంది. దీంతో వైరస్ వ్యాప్తి తీరును నిర్ధారించేందుకు మురుగునీటి పరీక్షల అంశంపై హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఐఐసీటీ, సీసీఎంబీలు పరిశోధన చేపట్టాయి. నగరవ్యాప్తంగా నిత్యం 1800 మిలియన్ లీటర్ల మురుగు వస్తుండగా.. 760 మిలియన్ లీటర్లనే (40 శాతం) మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో(ఎస్టీపీల్లో) శుద్ధి చేస్తున్నారు. వీటిలో 80 శాతం కేంద్రాల వద్ద 35 నమూనాలను సేకరించి సీసీఎంబీలో పరిశీలించారు.
- ఇళ్ల నుంచి వచ్చే మురుగు ఆధారంగా..
కరోనా సోకి తగ్గినా సరే బాధితుల మలమూత్రాల్లో దాదాపు 35 రోజుల వరకు వైరస్ పదార్థాలు విడుదలవుతుంటాయి. లక్షణాలు ఉన్నవారితో పాటు లేనివారి విసర్జితాల్లోనూ వైరస్ ఉంటోంది. ప్రతి ఇంట్లోంచి ఎంత మురుగు వస్తోందనే గణాంకాల ఆధారంగా ఎంతమందికి కరోనా వచ్చి తగ్గి ఉంటుందనే అంచనాలు రూపొందించారు. నగరంలోని 2 లక్షల మంది విసర్జితాల్లో వైరస్ విడుదలైనట్లు పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. శుద్ధి చేయని 60 శాతం మురుగును కూడా కలిపితే 6.6 లక్షల మంది వైరస్ బారిన పడి గత 35 రోజుల్లో సాధారణ స్థితికి వచ్చి ఉంటారని అంచనా వేశారు.
సంప్రదాయ పద్ధతిలో ఊహించిన అంచనాల ప్రకారం 2.6 లక్షల మందికి వ్యాధి వచ్చి ఉంటుందని.. దానికంటే ఇది చాలా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ‘తాజా అధ్యయనం ప్రకారం కరోనా రోగ లక్షణాలు లేనివారు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. వ్యాధి తీవ్రత ఉన్న ప్రాంతాలను గుర్తించడమే కాకుండా నిరోధించడానికి, సమర్థంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. మహమ్మారి విజృంభించిన ఈ సమయంలో దాని నియంత్రణలో మన ఆరోగ్య వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తున్నాయని సీసీఎంబీ సంచాలకులు డాక్టర్ రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు.
- ఆ నీటితో ఇతరులకు వ్యాపించదు
ఎస్‌టీపీలలో శుద్ధి చేయని నీటిలో వైరస్ ఆనవాళ్లు కన్పించగా.. శుద్ధి అనంతరం వైరస్ కన్పించలేదని పరిశోధనలో పాల్గొన్న ఐఐసీటీ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వెంకటమోహన్ తెలిపారు. మురుగునీటిలో వైరస్ ఆనవాళ్లతో ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఇందులో కేవలం ఆర్‌ఎన్‌ఏ మాత్రమే ఉంటుందన్నారు. దీని ద్వారా ఇతరులకు వ్యాధి వ్యాపించదన్నారు.
ఇదీ చూడండి:'అక్కడే తేల్చుకుందాం... అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సిద్ధంకండి'