రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతోంది. కొత్తగా 6 వేల 96 మందికి కరోనా నిర్ధరణ కాగా... మొత్తం కేసుల సంఖ్య 9 లక్షల 48 వేల 231కు పెరిగింది. చిత్తూరు జిల్లాలో గరిష్టంగా వెయ్యి 24 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 750, గుంటూరు 735, కర్నూలు 550, విశాఖ 489, శ్రీకాకుళం 534, ప్రకాశం 491, నెల్లూరు 354, అనంతపురం 313, విజయనగరం 299, కృష్ణా 246, కడప జిల్లాలో 243 కేసులు వెలుగుచూడగా... పశ్చిమగోదావరి జిల్లాలో కనిష్టంగా 68 కేసులు బయటపడినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35 వేల 592 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 2 వేల 194 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహమ్మారి బారిన పడి మరో 20 మంది మృతిచెందగా... మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7 వేల 373కి పెరిగింది.
కర్నూలు జిల్లాలో రోజూ 500కు పైగా కేసులు నమోదవుతున్నందున... నియంత్రణ చర్యలు పెంచినట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. కరోనా కేసులను గుర్తించేందుకు 21 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కరోనాతో 271 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని... వారిలో 260 మందికి ఆక్సిజన్ అందిస్తున్నట్లు వివరించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని సహా మొత్తం 11 కొవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేశామని వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లాలో 3 వేల 258 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయని... కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. కాకినాడ జీజీహెచ్, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, అమలాపురం కిమ్స్‌ను కొవిడ్ ఆసుపత్రులుగా మార్చి... వెయ్యి పడకలు అందుబాటులో ఉంచామన్నారు. కొవిడ్ సేవలకు ప్రైవేటు ఆసుపత్రులకూ అనుమతిస్తామన్నారు.
కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో... చాలా ప్రాంతాల్లో పడకలు దొరకడమే కష్టమవుతోంది. దీన్ని గుర్తించిన వైద్యాధికారులు... ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో పడకలు పెంచుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 117 ఆసుపత్రుల్లో 2 వేల 136 ఐసీయూ పడకలు ఏర్పాటు చేశారు. వీటిలో 597 పడకల్లో బాధితులు ఉండగా.... 15 వందల 39 పడకలు ఖాళీగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రెండు మంచాలు ఉండే గదుల్లో 9 వేల 544 పడకలు ఉండగా.... అందులో 6 వేల 752 ఖాళీగా ఉన్నాయి.