రాష్ట్రంలో కరోనా కేసులు ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రికార్డుస్థాయిలో 20.11% పాజిటివిటీ నమోదైంది. అంటే పరీక్షించిన ప్రతి ఐదుగురిలో ఒకరు వైరస్ బారిన పడినట్లయింది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు పరీక్షించడం, గుర్తించడం, చికిత్స అందించడం (టెస్ట్, ట్రాక్, ట్రీట్) విధానం అవలంబించాలని కేంద్రం పదేపదే సూచిస్తోంది. పరీక్షలు పెంచితేనే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంతో పాటు ఏం చేయాలో తెలుస్తుందని ఈ నెల 8న సీఎంలను ఉద్దేశించి ప్రధాని మోదీ పేర్కొన్నారు.
రాష్ట్రంలో మాత్రం పరీక్షలు పెరగడంలేదు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, ల్యాబ్‌ల ద్వారా రోజూ 90 వేలకుపైగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసే అవకాశం ఉన్నా... రోజుకు సగటున 35వేలు మాత్రమే జరుగుతున్నాయి. చికిత్సలో కీలకంగా ఉన్న రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లకూ కొరత ఏర్పడుతోంది. ఆక్సిజన్ అవసరాలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో శనివారం నిర్వహించిన 35వేల పరీక్షలకు 7,224 కేసులు బయటపడ్డాయి. అదే.. లక్ష వరకు పరీక్షలు చేస్తే కేసుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని వైద్యనిపుణులు అంటున్నారు. వైరస్ సోకిన వారిని, వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి... చికిత్స చేస్తే వ్యాప్తిని నియంత్రించేందుకు వీలుంటుంది. ఒక్కసారిగా కేసులు పెరిగితే పడకలు దొరక్కపోవడంతో పాటు కొత్త సమస్యలూ తలెత్తే అవకాశం ఉంది.