ఒక్కో జిల్లాలో 15 నుంచి 23 వరకు 108 అంబులెన్సుల్ని కొవిడ్ రోగులను తరలించేందుకు వినియోగిస్తున్నారు. అంబులెన్సు సిబ్బంది కొన్ని సందర్భాల్లో ఒకే మార్గంలో ఐదారుగురు కొవిడ్ రోగుల్ని ఎక్కించుకుని ఆసుపత్రులకు, సంరక్షణ కేంద్రాలకు తీసుకెళుతున్నారు. ఆ క్రమంలో డ్రైవర్లు, ఈఎంటీలు పీపీఈ కిట్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. ఎక్కడో ఒకచోట వైరస్ బారిన పడుతున్నారు. అత్యధికంగా కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 11 మంది చొప్పున అంబులెన్సు సిబ్బందికి కరోనా సోకింది. గుంటూరు జిల్లాలో వైరస్ సోకిన ఒక డ్రైవర్ ఇంట్లో కుటుంబీకులకు పరీక్షలు చేయగా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఇంట్లోనూ భయంభయంగా..
కొవిడ్ రోగుల్ని తరలిస్తున్న 108 వాహనాల సిబ్బంది విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లాకా భయంభయంగా గడుపుతున్నారు. తమవల్ల కుటుంబీకులకూ వైరస్ సోకుతుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. కొందరికి సమాజం నుంచీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ‘మేం చేస్తున్న పనేంటో అందరికీ తెలుసు. మా చుట్టుపక్కల ఉండేవారు కొందరు అర్థం చేసుకుని సహకరిస్తున్నారు. కొందరు మమ్మల్ని దూరం పెడుతున్నారు. ఇలాంటివన్నీ భరిస్తూనే విధులు నిర్వహిస్తున్నాం’ అని ఒక అంబులెన్సు ఉద్యోగి తెలిపారు. వీరు రోజులో ఎక్కువ సమయం పీపీఈ కిట్లు ధరించే ఉండాల్సి వస్తోంది. ‘ఐదారు గంటలపాటు కిట్ వేసుకుని విధుల్లో ఉండటంవల్ల గాలి పీల్చుకోవడంలో అసౌకర్యంతోపాటు వాహనం నడపటం ఇబ్బందిగా ఉంటోంది’ అని ఒక డ్రైవర్ తెలిపారు.