తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో(Huzurabad by elections 2021) టీకా అందరికీ పరీక్ష పెడుతోంది. మహమ్మారి సోకకుండా.. రక్షణగా నిలిచే వ్యాక్సినేషన్ విషయంలో యంత్రాంగం ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ వెలువడినప్పటి నుంచీ మొదటి డోసు టీకాల విషయంలో జిల్లా వైద్యారోగ్య శాఖ సిబ్బంది జోరు చూపించారు. ఇప్పటి వరకు దాదాపుగా 98శాతం మంది ఓటర్లకు మొదటి డోసు టీకా అందించారు. రెండో డోసు విషయంలోనూ అనూహ్య పురోగతిని చూపించారు.
ఓటు హక్కు కలిగిన వారిలో.. ఇప్పటి వరకు 62శాతం మంది రెండో దఫా వ్యాక్సిన్ (vaccination in karimnagar) అందించారు. ఈ వారం రోజుల్లోనూ ఓటు వేసే ప్రతి ఒక్కరూ టీకా వేసుకునేలా పర్యవేక్షణ పెంచుతున్నారు. మిగతా రెండు శాతం మందిని గుర్తించి, ఇంటింటికీ వెళ్లి మొదటిడోసు టీకా వేయబోతున్నారు. ఇక రెండో దఫా టీకాను తీసుకోవాల్సిన వారికి కూడా ఈ వారం రోజుల్లో ఎంతమందికి నిర్ణీత గడువు సమీపించినా వారందరికీ అందించేలా చొరవ చూపిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గవ్యాప్తంగా సంచార వాహనాలను తిప్పుతూ టీకాలను(vaccination in 2021) వేయిస్తున్నారు. 2.36 లక్షల మంది ఓటర్లుండగా దాదాపుగా 2.31 లక్షల మందికి టీకాలను వేయగలిగారు.
ధ్రువీకరణలు తప్పనిసరి..
ఇప్పటికే ఇక్కడి ఎన్నికల్లో(Huzurabad by elections 2021) పాల్గొనే అన్ని రకాల సిబ్బంది విషయంలో జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఎన్నికల సంఘం సూచించిన విధంగా ఇప్పటివరకు విధుల్లో ఉంటున్న వారంతా రెండోసారి టీకాను వేసుకున్నట్లు ఎన్నికల అధికారికి ధ్రువీకరణను సమర్పించి విధులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతకుముందు నామినేషన్‌ల ప్రక్రియ సమయంలోనూ పోటీ చేసే అభ్యర్థులతోపాటు వారికి మద్దతును తెలిపిన వారి విషయంలోనూ ఈ తరహా పత్రాలను ఎన్నికల అధికారులు తీసుకున్నారు.
మరోవైపు ఈనెల 30వ తేదీన జరిగే పోలింగ్‌లో, నవంబరు 2న జరిగే ఓట్ల లెక్కింపుల్లో పాల్గొనే ఆయా పార్టీల ఏజెంట్లు కూడా కరోనా పరీక్షల్ని విధిగా చేయించుకోవాలనే నిబంధనల్ని పెట్టారు. దీంతో ప్రధాన పార్టీలకు ఇది ఇబ్బందికరమైన పరిస్థితిగానే మారింది. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 305 పోలింగ్ కేంద్రాల్లో పాల్గొనే వారు కచ్చితంగా కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకుని నెగెటివ్ ఉన్నట్లుగా ధ్రువీకరణను ఎన్నికల అధికారులకు విధిగా అందించాల్సి ఉంటుంది. మొదటి డోసు టీకా తీసుకున్న వారు, రెండో డోసుకు అర్హతలేనివారు పోలింగ్, లెక్కింపు తేదీలకు 72 గంటల ముందు ఈ పరీక్షను చేసుకుని ధ్రువీకరణను అందించాలి. అలాగే ఒక డోసు కూడా టీకా తీసుకోని వారైతే మాత్రం ఈ నిర్ణీత తేదీలకు 48 గంటలలోపు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకుని ధ్రువీకరణతో హాజరవ్వాలి. ఇక ఈ తరహా పరీక్షల నిర్వహణ కోసం ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లను జమ్మికుంటతోపాటు కమలాపూర్‌లో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
ఇదీ చదవండి:చంద్రబాబుకు సీపీఐ నారాయణ ఫోన్.. ఏమన్నారంటే?