హైదరాబాద్ నగరంలో కరోనా మహమ్మారి చప్పుడు చేయకుండా చుట్టుముడుతోంది. జియాగూడ పరిధిలో వందకు పైగా, మంగళ్‌హాట్ పరిధిలో 50కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం నగరవాసుల్ని కలవర పెడుతోంది. ఆ రెండు ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలకు కుటుంబాలే కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. జియాగూడ కేంద్రంగా పలు ప్రాంతాలకు వైరస్ పాకినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్‌లో నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన కిరాణా దుకాణాల వ్యాపారులు అధిక శాతం వైరస్ బారిన పడుతున్నట్లు తెలిసింది. మంగళ్‌హాట్‌లో కొత్తగా మరో ముగ్గురిని పాజిటివ్‌లుగా నిర్ధరించారు. దీంతో ఆ ప్రాంతంలో బాధితుల సంఖ్య 59కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆదివారం 23 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో నలుగురు మరణించారు.
కార్వాన్‌లో ఒకే ఇంట ఆరుగురికి
కార్వాన్ పరిధిలో ఉంటూ హోల్‌సేల్ దుకాణంలో పనిచేస్తున్న ఓ వ్యక్తికి కొవిడ్-19 సోకగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ కుటుంబంలోని 8 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచి వైద్యపరీక్షలు నిర్వహించగా తాజాగా మరో ఐదుగురు పాజిటివ్‌గా తేలారు.
ముగ్గురు చిరు వ్యాపారులకు..
భోలక్‌పూర్ డివిజన్‌కు చెందిన ఓ వ్యక్తి(45) వ్యాపారం నిమిత్తం పురానాపుల్‌కు వెళ్లగా జ్వరం వచ్చింది. పరీక్షలు నిర్వహించి కరోనా వచ్చిందని గుర్తించారు. ఈ డివిజన్‌లో 8 పాజిటివ్ కేసులు నమోదుకాగా వీరిలో ముగ్గురు చిరువ్యాపారులే.
అక్కకు సపర్యలు చేసేందుకు వెళ్లిన చెల్లికి
మంగళ్‌హాట్ ఠాణా పరిధిలో తాజాగా మరో 3 కేసులు నమోదయ్యాయి. క్కెరవాడీకి చెందిన మహిళ(58), ఆమె కొడుకు(26) వైరస్ బారినపడ్డారు. మరో ప్రాంతంలో, కరోనా సోకిన అక్కకు సపర్యలు చేసేందుకు వెళ్లిన మహిళకు కరోనా సోకింది. అక్క మరణించగా.. ఇంటికి చేరిన ఆమెకు పాజిటివ్ రావడం వల్ల కుటుంబంలోని 17 మందిని క్వారంటైన్‌లో ఉంచారు.
కుమారుడి ద్వారా తల్లికి..
బోరబండలోని బంజారానగర్‌కు చెందిన మాంసం దుకాణ నిర్వాహకుడి(27) నుంచి అతని తల్లికి వైరస్ సోకింది. వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీలోని మీసేవా కేంద్రం సమీపంలో ఓ వృద్ధురాలు కరోనా బారిన పడగా తాజాగా తనయుడికీ సోకింది.