రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల శాతం రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. ఆగష్టు 23 నాటి వరకూ చేసిన పరీక్షల్లో ప్రతి వంద మందిలో 16.52 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణైంది. రాష్ట్రంలో తొలి కరోనా కేసు మార్చి రెండో వారంలో నమోదవగా అప్పట్నుంచి మే నెలాఖరు వరకూ నమోదైన పాజిటివ్ కేసులు 0.96 శాతం మాత్రమే. అది జూన్‌లో 2.163కు జులైలో 12.33 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ పాజిటివ్ కేసుల శాతమూ పెరుగుతోంది. మార్చి నుంచి మే నెలాఖరు వరకూ 3 లక్షల 83వేలకుపైగా పరీక్షలు చేయగా ఆగస్టులో 23వ తేదీ వరకే 12 లక్షల 79వేల 928 పరీక్షలు నిర్వహించారు. ఆగస్టు 20 నాటికి తూర్పుగోదావరిలో ప్రతి వంద పరీక్షలకు 24.14 శాతం పాజిటివిటీతో తొలిస్థానంలో ఉండగా 7.75శాతంతో కృష్ణా జిల్లా చివరి స్థానంలో నిలిచింది
తూర్పుగోదావరిలో తగ్గిన ఉద్ధృతి
ఇక జిల్లాలవారీగా చూస్తే తూర్పుగోదావరి జిల్లాలోనే రోజువారీ అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 1353 మందికి పాజిటివ్ తేలగా కేసుల సంఖ్య 52 వేల 39కి చేరింది. కాకినాడలో 290, రాజమహేంద్రవరంలో 149, అమలాపురం మండలంలో 90 పెద్దాపురంలో 86 మందికి కొవిడ్ నిర్ధరణైంది. జిల్లాలో ప్రస్తుతం 17వేల 750 మందికి చికిత్స కొనసాగుతోంది.
విశాఖ జిల్లా అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌లో.. ఎస్సై, ఏఎస్సై కరోనా బారినపడ్డారు. చీడిపల్లిలో నాటుసారాతో పట్టుబడ్డ 14 మందిని జైలుకు తరలించే ముందు పరీక్షలు నిర్వహించగా వారిలో ఏడుగురికి కరోనా ఉందని తేలింది.