తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. శనివారం ఒక్క రోజే వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పది మంది ఉపాధ్యాయులు, ఓ అంగన్‌వాడీ కేంద్రం బోధకురాలికి, నాల్గో తరగతి విద్యార్థినికి కరోనా నిర్ధారణ అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. టేకులపల్లి మండలం తొమ్మిదో మైలుతండా యూపీఎస్‌కు చెందిన ఓ ఉపాధ్యాయురాలు, ఇదే మండలం కోయగూడెం అంగన్‌వాడీ కేంద్రం బోధకురాలికి కరోనా నిర్ధారణ అయింది.
పినపాక మండలం పోతురెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు, కరకగూడెం మండలం వెంకటాపురం గిరిజన ప్రాథమిక పాఠశాల, దమ్మపేట మండలం రంగువారిగూడెం ప్రాథమిక పాఠశాల, జూలురుపాడు మండలం పాపకొల్లు ఉన్నత పాఠశాలకు చెందిన ఒక్కో ఉపాధ్యాయుడు చొప్పున కొవిడ్‌బారిన పడ్డారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకిట్యాతండా యూపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి పాజిటివ్‌గా తేలింది. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడితోపాటు రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఇర్విన్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆయన భార్యకు కూడా శనివారం కరోనా నిర్ధారణ అయింది.
నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని బాహర్‌పేట జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడికీ పాజిటివ్ వచ్చింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికీ వైరస్ సోకింది. ఇదిలా ఉండగా.. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు కొవిడ్ బారినపడినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. గత గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, శుక్రవారం మరో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా నిర్ధారణ అయినట్లు యాదగిరిగుట్ట ఎంఈవో వంశీకృష్ణ శనివారం వెల్లడించారు. ఉపాధ్యాయులకు కరోనా సోకిందని తెలియగానే ఆయా పాఠశాలల్లోని విద్యార్థులు, మిగతా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి శనివారం పరీక్షలు చేయించారు. వారందరికీ నెగెటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణలో 306 కరోనా కేసులు