ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్​ బాధితులకు ముచ్చెమటలు పట్టిస్తున్న విద్యుత్​ కోతలు - power cuts effects on corona treatment

విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు హైదరాబాద్​ నగరంలో కొవిడ్‌ రోగుల ప్రాణాల మీదకొచ్చింది. ఆసుపత్రుల్లో పడకలు దొరక్క చాలా మంది బాధితులు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో కొందరు ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందుతున్నారు. తరచూ విద్యుత్‌ అంతరాయాలతో వీరు ఉలిక్కిపడుతున్నారు.

POWER CUTS NEW PROBLEM FOR COVID PATIENTS in hyderabad
POWER CUTS NEW PROBLEM FOR COVID PATIENTS in hyderabad

By

Published : Apr 26, 2021, 3:11 PM IST

విద్యుత్‌ కోతలు హైదరాబాద్​ నగరంలో కొవిడ్‌ రోగుల ప్రాణాల మీదకొచ్చింది. ఆసుపత్రుల్లో పడకలు దొరక్క చాలా మంది బాధితులు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో కొందరు ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందుతున్నారు. తరచూ విద్యుత్‌ అంతరాయాలతో వీరు ఉలిక్కిపడుతున్నారు. కొన్నిసార్లు వెంటనే వస్తున్నా.. మరికొన్నిసార్లు గంట నుంచి రెండు గంటలపాటూ రావడం లేదు. ఆ సమయంలో ఆక్సిజన్‌పై ఉన్న కొవిడ్‌ రోగుల పరిస్థితి క్షణక్షణం ప్రాణగండంలా మారుతోంది. గ్రేటర్‌లో కొద్దిరోజులు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు పెరిగాయి.

ఈదురుగాలులు, ఆకాల వర్షాలకు తోడు.. నిర్వహణ లోపాల కారణంగా అంతరాయాలతో కొవిడ్‌ రోగులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నగరంలోని మూడు జిల్లాల పరిధిలో రోజూ రెండువేల వరకు కేసులు నమోదవుతున్నాయి. వీరిలో 80శాతం మందికిపైగా హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ప్రత్యేకంగా ఒక గదిలో కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ..ఫోన్‌లోనే వైద్యులను సంప్రదిస్తూ చికిత్స పొందుతున్నారు. అసలే నగరంలో చాలావరకు ఇరుకిరుకు ఇళ్లు. కరెంట్‌ లేకపోతే.. అందులో వేసవిలో నిమిషం లేకపోయినా ఉక్కపోతతో అల్లాడాల్సిందే. ఈ క్లిష్ట సమయంలో విద్యుత్‌ రోజూ పోతుందని పలు కాలనీవాసులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆక్సిజన్‌పై ఉన్నవారి గోస చెప్పనక్కర్లేదు. మెరుగైన సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు ఉండటం లేదు.

నిత్యం ఇక్కట్లే..

పలు ఫీడర్ల పరిధిలో ఆదివారం కరెంట్‌ సమస్యలు తలెత్తాయి. మధురా ఎన్‌క్లేవ్‌, లంగర్‌హౌజ్‌, కొత్తగూడ, కొండాపూర్‌, పూల్‌బాగ్‌, ఫ్యాఫ్సీ, దస్‌పల్లా, పద్మావతినగర్‌, స్టేషన్‌రోడ్‌, సమంతానగర్‌, ఏవోసీ సెంటర్‌, గాంధీనగర్‌, ఉర్దూహాల్‌, మిర్జాల్‌గూడ, సత్తార్‌బాగ్‌, ఈఎంఈ సెంటర్‌, కిమ్స్‌ ఫీడర్‌, జీడిమెట్ల-4 సరఫరాలో సమస్యలు తలెత్తాయి. అరగంట నుంచి రెండు గంటలపాటు ఇబ్బందులుపడ్డారు. కొన్నిచోట్ల నిర్వహణ పేరుతో ఆపేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరునాటికి పూర్తికావాల్సిన నిర్వహణ పనులు కొన్ని ఉపకేంద్రాల పరిధిలో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నల్లగండ్లలో నిర్వహణ పేరుతో విద్యుత్‌ను నిలిపేశారు. మచ్బబొల్లారం ఉపకేంద్రం పరిధిలోని మధురా ఎన్‌క్లేవ్‌ ఫీడర్‌లో ఉదయం, సాయంత్రం విద్యుత్‌ పోయింది.

ఆసుపత్రులున్న ప్రాంతాల్లోనూ...

నివాస ప్రదేశాలతోపాటు ఆసుపత్రులున్న ప్రాంతాల్లోనూ విద్యుత్తు అంతరాయాలు రోగులకు ఇబ్బందిగా మారాయి. ఆసుపత్రుల్లో జనరేటర్లు ఉన్నప్పటికీ తరచూ వచ్చేపోయే విద్యుత్‌తో సమస్యలు ఎదురవుతున్నాయి. కిమ్స్‌, నిలోఫర్‌ హాస్పిటల్‌ ఫీడర్‌ పరిధిలో ఆదివారం అంతరాయాలు ఏర్పడ్డాయి.

రంజాన్‌వేళల్లో...

ప్రస్తుతం రంజాన్‌ మాసం కొనసాగుతోంది. చాలామంది రోజా పాటిస్తుంటారు. తెల్లవారుజామునే వీరి దినచర్య మొదలవుతుంది. ఆ సమయంలోనూ కరెంట్‌ కటకట తప్పడం లేదు. పాతబస్తీలో కరెంట్‌ అంతరాయాలపై స్థానిక ఎమ్మెల్యేలు తరచూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తున్నా.. సరఫరా మాత్రం మెరుగుపడటం లేదు.

ఇదీ చూడండి:

విజయవాడలో ఆక్సిజన్ కొరత..రోగులకు తప్పని కష్టాలు

ABOUT THE AUTHOR

...view details