ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మనుషుల్ని విడగొడుతోంది... మానవత్వం కొడిగడుతోంది! - కరోనా వార్తలు

కరోనా మహమ్మారి కారణంగా మానవత్వం మంటగలిసిపోతోంది. వైరస్‌తో మరణించిన వారి మృతదేహాలను చూసేందుకు కొన్నిచోట్ల కుటుంబ సభ్యులూ ముందుకు రావడం లేదు. కొందరు మాత్రం ప్రభుత్వాసుపత్రుల మార్చురీ గదుల్లోని  భౌతిక కాయాలను దూరంగా ఉండి చూసి వెళ్లిపోతున్నారు.

corona pandamic is affceting on humanity
మనుషులని విడగోడుతున్న కరోనా

By

Published : Jul 23, 2020, 8:35 AM IST

కరోనా మహమ్మారి కారణంగా అనురాగం, ఆప్యాయత అదృశ్యమవుతున్నాయి వైరస్‌తో మరణించిన వారి మృతదేహాలను చూసేందుకు కొన్నిచోట్ల కుటుంబ సభ్యులూ ముందుకు రావడం లేదు. కొందరు మాత్రం ప్రభుత్వాసుపత్రుల మార్చురీ గదుల్లోని భౌతిక కాయాలను దూరంగా ఉండి చూసి వెళ్లిపోతున్నారు. చనిపోయిన వారి అంత్యక్రియలకు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండటం, వైరస్‌ తమకూ సోకుతుందోమోనన్న భయంతో ఇలా వ్యవహరిస్తున్నారు. మృతదేహాల నుంచి వైరస్‌ ఇతరులకు సోకుతుందనడానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవని వైద్య నిపుణులు పదేపదే చెబుతున్నా ప్రజల్లో అపోహలు తొలగడం లేదు. ప్రభుత్వాసుపత్రులు, పురపాలక, కార్పొరేషన్‌ అధికారులే మృతదేహాలను ఖననం చేయించాల్సి వస్తోంది. ఒంగోలులో ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగి ఒకరు మరణించగా చూసేందుకు కుటుంబసభ్యులు, బంధువులు ఎవరూ రాలేదు. ఆసుపత్రి వర్గాలే ఖననం చేశాయి. ఈ తరహా సంఘటనలు విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లోనూ జరిగాయి.

  • మధ్యలోనే వెళ్లిపోయిన మనవడు

శ్రీకాకుళం జిల్లాలో ఓ వృద్ధుడు మరణించారు. అనంతరం చేసిన పరీక్షలో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. వృద్ధుడికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు కువైట్‌లో నివసిస్తున్నారు. స్థానికంగా ఉండే మనవడు (కుమార్తె కుమారుడు) దహన సంస్కారాలు చేసేందుకు వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) ధరించి వచ్చారు. ఏమనుకున్నారో ఏమో అంత్యక్రియలు పూర్తి చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో పారిశుద్ధ్య కార్మికుల సాయంతో వృద్ధుడి భార్య అంతిమ సంస్కారాలు చేశారు.

  • డ్రైవర్‌ రానందున..

శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన ఓ వ్యాపారి విశాఖ కొవిడ్‌ ఆసుపత్రిలో మరణించారు. సోంపేటలో ఉన్న కుటుంబసభ్యులకు సొంతకారు ఉంది. 130 కిలోమీటర్ల దూరంలోని విశాఖ వెళ్లేందుకు డ్రైవరు కోసం ప్రయత్నించారు. ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వారు విశాఖకు వెళ్లలేక పోవడంతో ఆసుపత్రి వారే ఖనన ఏర్పాట్లు చేశారు.

  • సెల్‌ఫోన్‌ వీడియోలో చివరిచూపులు

విశాఖ రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రిలో మరణించిన వారిలో సుమారు 25% మంది... తమ కుటుంబసభ్యులు, బంధువుల చివరి చూపులకు నోచుకోవడం లేదని కొవిడ్‌-19 ప్రత్యేక అధికారి డాక్టర్‌ పీవీ సుధాకర్‌ పేర్కొన్నారు. విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో చనిపోయిన వారిని దూరంగా ఉండి చూసి, నివాళులు అర్పించి వెళ్లిపోతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొందరు సెల్‌ఫోన్‌లో వీడియోల ద్వారా కడసారి చూస్తున్నారని, తమరే ఎలాగైనా ఖననం చేయించాలని అడుగుతున్నారని విశాఖ జీవీఎంసీ అధికారి ఒకరు పేర్కొన్నారు.

  • 18న మరణిస్తే... 22న అంత్యక్రియలు

ఈ నెల 18న ఒంగోలులోని రంగుతోటకు చెందిన వ్యక్తి గుండెనొప్పితో బాధపడుతుండగా ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయగా వైరస్‌ సోకినట్లు తేలింది. చికిత్స పొందుతూ చనిపోగా ఆయన మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. నిబంధనల ప్రకారం... కుటుంబసభ్యులు తమకు సంబంధం లేదని రాసిస్తేనే మృతదేహాల ఖననానికి అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని, అందుకు కొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు తగిన జాగ్రత్తలతో సొంతంగా అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నించారు. వెళ్లిన ప్రతి శ్మశానవాటిక దగ్గరా స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. చివరికి బుధవారం ఒంగోలు మండల రెవెన్యూ అధికారి చిరంజీవి, పోలీసుల సహకారంతో తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేయగలిగినట్లు ఆయన కుమారుడు తెలిపారు. ఒంగోలులోని జిల్లా సర్వజన ఆసుపత్రిలో పొదిలికి చెందిన 56 ఏళ్ల వ్యక్తి ఇటీవల మరణించారు. కమ్మపాలెంలోని శ్మశానవాటికలో ఖననం చేయబోగా స్థానికులు అభ్యంతరం తెలిపారు. కుటుంబసభ్యులు ఈ విషయాన్ని లీగల్‌సెల్‌ అథారిటీ దృష్టికి తీసుకువెళ్లారు. న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలతో సమస్య పరిష్కారమైంది.

బ్యాగులోకి గాలి, నీరు చేరదు

కరోనా రోగులు మరణించిన 6 గంటల తర్వాత వారిలో వైరస్‌ ఉండదు. భూమిలో 6 నుంచి 8 అడుగుల లోతున తవ్విన గుంతలో మృతదేహాన్ని ప్రత్యేక జిప్‌ బ్యాగులో తగిన జాగ్రత్తలతో ఉంచుతున్నాం. దీనివల్ల లోపలికి గాలి, నీరు వెళ్లేందుకు అవకాశం లేదు.

- డాక్టర్‌ పీవీ సుధాకర్‌, కొవిడ్‌-19 ప్రత్యేక అధికారి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం

వెనుకాడుతున్నారు

ఆప్తులను ఆసుపత్రుల్లో చేర్పించే దాకా బంధువులు హడావుడి పడుతుంటారు. వారు మరణించారని తెలిస్తే మాత్రం వచ్చి చూసేందుకు వెనుకాడుతున్నారు. మృతి గురించి సమాచారం ఇచ్చినప్పుడు కొందరు ఇంటి దగ్గర పరిస్థితులు సవ్యంగా లేవని... మీరే ఖననం చేయించండని కోరుతున్నారు. మరణించిన వారితో తమకు సంబంధంలేదంటూ రాసిచ్చేందుకు వెనుకాడటంలేదు. అలాంటి ‘అన్‌ క్లెయిమ్డ్‌’ కింద మృతదేహాలను దూర ప్రాంతాలకు తరలించి ఖననం చేయిస్తున్నాం.

- డాక్టర్‌ వేణుగోపాలరెడ్డి, ఆర్‌ఎంవో ఒంగోలు జీజీహెచ్‌

ఇదీ చదవండి:

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 65 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details