ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా దెబ్బకు నిర్మాణ రంగం కుదేలు - నిర్మాణ రంగంపై లాక్​డౌన్ ఎఫెక్ట్

రాష్ట్రంలో నిర్మాణరంగం పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా తయారైంది. కరోనా ప్రభావానికి ముందు ఇసుక సంక్షోభం నిర్మాణ రంగాన్ని వేధిస్తే... ఇప్పుడు లాక్​డౌన్ నిబంధనలు నిర్మాణరంగ కార్మికులను ఆకలి కేకలు వేయిస్తున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవటంతో పాటు... నిర్మాణ రంగంపై ఆధారపడ్డ లక్షలాది మంది పరిస్థితి దయనీయంగా మారింది.

కరోనా దెబ్బకు నిర్మాణ రంగం కుదేలు
కరోనా దెబ్బకు నిర్మాణ రంగం కుదేలు

By

Published : May 29, 2020, 2:43 PM IST

దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన నిర్మాణ రంగాన్ని కరోనా కోలుకోలేని దెబ్బతీసింది. రాష్ట్రంలో లక్షలాది కార్మికులు నిర్మాణ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తాపీ పని కార్మికులు, ప్లంబర్లు, వడ్రంగి పనివాళ్లు, ఎలక్ట్రిషియన్లు, పెయింటర్లు పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మాణాలు ఆగిపోవటం వల్ల పనులు లేక పస్తులు ఉంటున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.


జీవనోపాధిలో భాగంగా కల్పించిన లాక్​డౌన్ వెసులుబాటు రాష్ట్రంలో అమలు కావట్లేదని కార్మికులు అంటున్నారు. నిర్మాణ రంగం పనులు పూర్తిగా నిలిచిపోవటంతో ..ఈ రంగంపై ఆధారపడిన దాదాపు 50 లక్షల మంది ఉపాధిలేక అలమటిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కార్మికరంగానికి చేస్తున్న ఆర్థికసాయం రాష్ట్రంలోనూ అమలు చేయాలని వేడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు దారిమళ్లించే యత్నం చేయటం సరికాదని హితవు పలుకుతున్నారు.

లాక్​డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చినా నిర్మాణ రంగానికి ఊరట కలగటంలేదు. కూలీలంతా సొంతూళ్లకు వెళ్లిపోవటం వల్ల కూలీల కొరత ఏర్పడుతోంది. కరోనా ప్రభావం నిర్మాణ రంగానికి అనుబంధంగా ఉన్న ఇతర రంగాలపైనా పడటంతో ఈ రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి కనబడటంలేదు.

కరోనా రియల్ ఎస్టేట్ రంగంతో పాటు.. ఈ రంగంపై ఆధారపడ్డ లక్షలాదిమందిని తీవ్రంగా దెబ్బతీసింది. సడలింపుల తర్వాత కూడా ఈ ప్రభావం దాదాపు ఏడాది ఉంటుందని నిపుణులు అంటున్నారు. రియల్ ఎస్టేట్​కు అనుబంధంగా ఉన్న దాదాపు 25 రంగాలు కుదేలయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరుల్లో ఒక్కటైన రిజిస్ట్రేషన్ల శాఖపై ప్రభావం పడటంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని తెలిపారు.

కరోనా దెబ్బకు కుదేలైన తమను ఆదుకోవాలని నిర్మాణరంగ కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నిర్మాణ రంగంలోని కార్మికులకు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల కోటాలో ప్రభుత్వ ప్రోత్సహకాలు అందించాలని కోరుకుంటున్నారు. విదేశీ కలపను నేరుగా ప్రభుత్వమే బల్క్​గా కొనుగోలు చేసి దళారులు లేకుండా కార్మికులకు తక్కువ ధరకు అందించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి :హైకోర్టు తీర్పుపై పవన్ హర్షం

ABOUT THE AUTHOR

...view details