రాష్ట్రంలో కరోనా మహమ్మారి జూలు విదిల్చింది. మొదట్లో చాపకింద నీరులా విస్తరించిన ఈ వైరస్ ఇప్పుడు కార్చిచ్చులా చుట్టేస్తోంది. మొదట్లో రోజుకు 10, 15 కేసులు పెరిగితేనే అమ్మో అనుకునే వాళ్లం! ఇప్పుడు రోజూ వందల్లో పెరుగుతున్నాయి. అతి త్వరలోనే మరింత పెరిగే దశకు చేరుకునే ప్రమాదం పొంచి ఉంది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో 425 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంత ఎక్కువ స్థాయిలో రావడం ఇదే మొదటిసారి. ప్రజలు అప్రమత్తంగా లేకపోవడం, వ్యక్తిగత దూరం పాటించకపోవడంవల్లే వైరస్ ఇంతలా వ్యాప్తి చెందుతోందన్నది వాస్తవం. ప్రజలు జాగ్రత్తగా ఉంటే వైరస్ సోకే ప్రమాదాన్ని 90% వరకు అరికట్టవచ్చని ప్రభుత్వాలు, డబ్ల్యూహెచ్‌వో లాంటి ఆరోగ్య సంస్థలు చెవిన ఇల్లు కట్టుకుని పోరుతున్నా... చాలా మంది వాటిని లెక్క చేయకపోవడంవల్లే సమస్య తీవ్రమవుతోంది. అలాంటివారు తమతోపాటు, చుట్టూ ఉన్నవారికీ ప్రమాదకారులుగా.. అంటే సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారు.
మరింత ఉద్ధృతి
రాష్ట్రంలో గడచిన 10 రోజుల్లో కరోనా కేసుల ఉద్ధృతి బాగా పెరిగింది. మార్చి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో మూడొంతులకు పైగా ఈ పది రోజుల్లోనే నమోదయ్యాయి. జూన్ 9న 5,029గా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య 18నాటికి 7,496కి చేరింది. అంటే కేవలం పది రోజుల వ్యవధిలో 2,467 కేసులు పెరిగాయి.
లాక్‌డౌన్ సడలిస్తే కరోనా పోయినట్టా?
లాక్‌డౌన్ సడలించడంతో కరోనా పోయినట్టేనన్న భావనలో చాలామంది ఉన్నారు. మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి, జాగ్రత్తలన్నీ గాలికొదిలేస్తున్నారు. మార్కెట్లు, రైతుబజార్ల వద్ద గుంపులుగా చేరిపోతున్నారు. చాలా దేశాలతో పోలిస్తే భారత్‌లో జన సాంద్రత ఎక్కువ. ఇక్కడ కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరితే పరిస్థితి ఘోరంగా మారుతుంది. రోజూ వేల సంఖ్యలో కేసులొస్తే ఆసుపత్రుల్లో పడకలూ చాలవు. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది.