కరోనా రెండో దశ వ్యాప్తి... తెలంగాణ రాష్ట్ర ప్రజలను వణికిస్తోంది. మహమ్మారి విజృంభణతో రోజురోజుకీ పరిస్థితులు క్రమంగా చేయిదాటిపోతున్నాయి. 8 వారాల్లో 25 రెట్లు కేసులు పెరిగాయి. ప్రస్తుతం 25 వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉండగా...వారిలో మూడోవంతు రోగులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 6 వారాల కిందట ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్న వారి సంఖ్య... వెయ్యి మాత్రమే ఉండగా... ఇప్పుడు ఏకంగా ఎనిమిదింతలు పెరగటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గతంలో కొవిడ్ బారిన పడిన వారిలో 2.4 శాతం మందికి ఆక్సిజన్ అవసరం పడగా... ఇప్పుడది 4.5 శాతానికి పెరిగింది. మరోవైపు వెంటిలేటర్ మీదకు వచ్చే వారి సంఖ్య సైతం 2.7 శాతానికి చేరింది. అటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ... కరోనా కలకలం సృష్టిస్తోంది. సచివాలయంతోపాటు మరిన్ని కార్యాలయాల్లో ఉన్నతాధికారులు వైరస్ బారిన పడుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఒక్క రోజే 728 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో మహారాష్ట్ర పరిస్థితి!
కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందనే బలమైన ఆధారాలున్నాయని.. అప్రమత్తంగా ఉండకపోతే మహారాష్ట్ర పరిస్థితే రాష్ట్రంలో నెలకొంటుందని ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస్ హెచ్చరించారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయని... పరిస్థితి ఇలాగే కొనసాగితే పడకల కొరత నెలకొంటుందని చెప్పారు. గతంతో పోల్చితే ప్రస్తుత వైరస్ వేగంగా వ్యాపిస్తోందని... ఇప్పటివరకు బయట మాత్రమే మాస్క్ ధరించాలని చెప్పామని.. ఇకపై ఇంట్లో ఉన్నా మాస్క్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. మరో 4 నుంచి 6 వారాల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని.. ప్రజల జీవనోపాధి దెబ్బతినకూడదనే ప్రభుత్వం లాక్‌డౌన్ పెట్టడం లేదన్నారు.