పాఠశాలలు మళ్లీ తెరిచారు. విద్యార్థులు వస్తున్నారు. కానీ ఇప్పటికీ కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో కేసులు వస్తున్నా, చాలాచోట్ల భౌతిక దూరం లాంటి నిబంధనలను పాటించడం లేదు. ఒక్కో గదిలో 20 మంది విద్యార్థులనే అనుమతించాల్సి ఉంటే.. కొన్నిచోట్ల 30 మంది ఉంటున్నారు. ఇక మధ్యాహ్న భోజనాలప్పుడు దూరం అసలు ఉండట్లేదు. మాస్కులున్నా, వాటిని ముక్కు కిందకే పెడుతున్నారు. గదుల శానిటైజేషన్ అంతంతగానే ఉంది. థర్మల్ స్క్రీనింగ్ సక్రమంగా సాగడం లేదు. శానిటైజర్లు, సబ్బులు, ఇతర సామగ్రి కొనుగోలుకు నిధులు లేక... ప్రధానోపాధ్యాయులు సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. అలా చేసి బిల్లులు పెడితే సకాలంలో విడుదల కావట్లేదని వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని పాఠశాలలను ‘ఈనాడు’ యంత్రాంగం పరిశీలించగా అనేకచోట్ల కరోనా నిబంధనలు పాటించట్లేదు.
ఏం చేయాలనే దానిపై అస్పష్టత..
బడిలో కరోనా కేసులు వస్తే ఏం చేయాలనే దానిపైనా ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఎవరైనా కరోనా బారిన పడితే బడిని శానిటైజ్ చేసి.. ఒకటి, రెండు రోజులు సెలవులు ఇచ్చి, మళ్లీ తెరుస్తున్నారు. కృష్ణాజిల్లా నిడమానూరు జిల్లాపరిషత్తు పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు కరోనా బారిన పడ్డారు. దీంతో అందరినీ పరీక్షించారు. ఈ పాఠశాలలో 6,7,8 తరగతులకు ఒక్క రోజు సెలవు ప్రకటించారు. 9,10 తరగతులను బడికి రావాలని సూచించారు. నందివాడ మండలం శంకరంపాడు ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. బడిలో 30మంది విద్యార్థులను పరీక్షిస్తే ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. రెండు రోజులు సెలవులు ప్రకటించారు. పాఠశాలల్లో కొందరికి కరోనా వచ్చినా, అక్కడి విద్యార్థులందరికీ పరీక్షలు చేయట్లేదు. కొద్దిమందికే చేసి వదిలేస్తున్నారు.
నిబంధనల అమలు ఎలా?
కొవిడ్-19 నిబంధనలు పాటించాలని ఆదేశించిన ఉన్నతాధికారులు ఇందుకోసం ప్రత్యేకసెల్‌ను ఏర్పాటుచేయలేదు. గతేడాది కరోనా కేసుల పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. బడుల్లో ర్యాపిడ్ పరీక్షలు ఎలా జరుగుతున్నదీ పరిశీలించే పరిస్థితి ఉన్నత స్థాయిలో లేదు. ప్రధానోపాధ్యాయులే ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
*శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత ఉండటంతో ఒక చోటే కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. రాజాం నియోజకవర్గంలో 15 పాఠశాలలకు 14 చోట్ల, ఇచ్ఛాపురంలో 26 బడులకు 21 చోట్ల విద్యార్థులు భౌతిక దూరం పాటించట్లేదు. టెక్కలి నియోజకవర్గంలో 24 బడులకు 2,034 మంది హాజరయ్యారు. వారిలో 1,200 మంది వరకు మాస్కు పెట్టుకోలేదు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో 14 పాఠశాలలను పరిశీలించగా 12 చోట్ల థర్మల్ స్క్రీనింగ్ చేయలేదు.
*విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం పరిధిలో అన్నీ కలిపి 555 వరకు పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 20 వేల మంది చదువుకుంటున్నారు. కరోనా భయంతో 40% విద్యార్థులు బడులకు, వసతిగృహాలకు రావడం లేదు. పాడేరు నంబరు వన్ పాఠశాలలో 200కు పైగా విద్యార్థులు ఉండగా 50లోపే హాజరయ్యారు. తలారిసింగ్ ఆశ్రమ పాఠశాలలో 550 మందికిగాను శుక్రవారం 180 మంది ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు మాస్కులు సరిగా పెట్టుకోవడంలేదు. కొన్ని పాఠశాలల్లో థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు లేవు. భౌతిక దూరం అమలు కావడం లేదు.
*పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి ఉన్నత పాఠశాలలో భౌతిక దూరం కనిపించలేదు. తాళ్లపూడి పాఠశాలలో విద్యార్థులు మాస్కులు సక్రమంగా ధరించలేదు. మధ్యాహ్న భోజనం, విరామ సమయంలో విద్యార్థులు గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపించారు. ఈ జిల్లాలో ఇప్పటివరకూ 29 మంది విద్యార్థులు, 19మంది ఉపాధ్యాయులకు కరోనా సోకింది.
*కృష్ణాజిల్లాలో 100 పాఠశాలలను పరిశీలించగా.. విద్యార్థుల హాజరు 60% ఉంది. అందరి దగ్గరా మాస్కులు ఉన్నా సగం మంది కూడా పెట్టుకోవడం లేదు. 30% బడుల్లోనే థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. 80% పాఠశాలల్లో విద్యార్థులంతా ఒకేచోట కూర్చుని తింటున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులే శానిటైజర్లు తెచ్చుకుంటున్నారు.
*నెల్లూరు వెంకటేశ్వరపురం పురపాలక ఉన్నత పాఠశాలలో 941 మంది విద్యార్థులు ఉండగా.. ఇక్కడ 17 గదులే ఉన్నాయి. తరగతి గదులు చాలక విద్యార్థులను గుంపులుగా కూర్చోబెడుతున్నారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయట్లేదు. ఎవరిలోనైనా కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే పరీక్షలకు వారి తల్లిదండ్రులతో పంపుతున్నారు. వైవీఎం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు దగ్గరగా కూర్చుని భోజనాలు చేస్తున్నారు. తరగతి గదులు శానిటైజ్ చేయడం లేదు. మూలపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 598 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో తరగతి గదులు లేక.. చెట్లకిందపాఠాలు చెబుతున్నారు.
*కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో 55 మంది ఉండగా అందరికీ ఒకేసారి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఆదోని నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో పదోతరగతిలో 367 మంది విద్యార్థులు ఉండగా అందర్నీ రోజూ బడికి రప్పిస్తున్నారు. శుక్రవారం ఒక గదిలో 93 మందిని కూర్చోబెట్టారు.
*అనంతపురం జిల్లాలో విద్యార్థుల హాజరు 79% ఉంది. తరగతిలో భౌతికదూరం లేదు. శానిటైజర్లు అందుబాటులో లేవు. విరామ సమయంలో విద్యార్థులు గుంపులుగా చేరుతున్నారు.
బడుల్లో ఇలా చేయాలి..