ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంపై కరోనా పంజా.. 1100 చేరువలో కేసులు

By

Published : Apr 26, 2020, 11:34 AM IST

Updated : Apr 27, 2020, 6:41 AM IST

రాష్ట్రంలో కొత్తగా 81 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 81 కరోనా కేసులు

10:43 April 26

కొత్తగా 81 కోవిడ్ కేసులు

రాష్ట్రంపై కరోనా పంజా.. 1100లకు చేరువలో కేసులు

రాష్ట్రంలో.. కరోనా తీవ్రత ఉద్ధృతమవుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ ఆందోళన రేపుతోంది. ఇప్పటివరకు 1097 కేసులు నమోదు కాగా..నిన్న ఒక్కరోజే 81 మందికి వైరస్‌ ఉన్నట్లు నిర్ధరించారు. మొత్తంగా చూస్తే వారంరోజులుగా కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. మూడొంతులకు పైగా కేసులు ఈ వారంలోనే నమోదుకావడం...అందరిలో భయం పుట్టిస్తోంది.  

కరోనా ఉద్ధృతి

రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గత వారంరోజుల్లో కేసుల తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. మొన్న కర్నూలు, నిన్న చిత్తూరు, నేడు కృష్ణా జిల్లా ఇలా కరోనా కేసుల ఉద్ధృతితో అల్లాడుతున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో నమోదైన కేసులను పరిశీలిస్తే...ఈనెల 20వతేదీ సోమవారం రోజున 75 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రోజు 35 కేసులు, 22వ తేదీ బుధవారం 56 కేసులు, గురువారం రోజున 80 కేసులు, శుక్రవారం 62, శనివారం 61, ఆదివారం 81 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా... మూడొంతులకు పైగా కేసులు ఈ వారం రోజుల్లలోనే నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 81 కేసులు నమోదవ్వగా...అందులో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 52, పశ్చిమ గోదావరి 12, మరో 6 జిల్లాల్లో 17 మంది బాధితులు వైరస్‌ బారిన పడ్డారని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఫలితంగా..రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 1097కి  చేరింది.

కృష్ణా జిల్లాలో

కృష్ణా జిల్లాలో ఒక్కసారిగా కేసులు సంఖ్య పెరగడంతో...ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. కేసులు ఎక్కువగా నమోదైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ..... తీవ్రత దృష్ట్యా ప్రజలెవరూ బయటకు రావద్దని...ఎవరైనా నిబంధనలు ఉల్లఘించి బయటకు వస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో

కరోనా ఉద్ధృతితో విలవిల్లాడుతున్న గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఆర్​టీపీసీఆర్, ట్రూనాట్, క్లియా పరీక్షలు నిర్వహిస్తుండగా..నిర్ధరణ పరీక్షల వేగం మరింత పెంచారు. ఇప్పటి వరకూ జిల్లాలో 214కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలోనూ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన రేపుతోంది. గుంటూరు నగరంలోనే 126 మంది బాధితులు ఉండగా, నరసరావుపేట 48, మిగిలిన గ్రామీణ ప్రాంతాల్లో మరో 38 మంది బాధితులు ఉన్నారు. గుంటూరులోని ఆనందపేట, చాకలిగుంట కంటైన్మైంట్ జోన్లలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ సలహాదారు డా. కమల్ రాజు స్వయంగా పర్యటించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో

పశ్చిమగోదావరి జిల్లా టీ నరసాపురం మండలం ఏపిగుంట గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలగా.. ఏలూరు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అతని కుటుంబీకులు సహా మొత్తం 19 మందిని తాడేపల్లిగూడెం ఐసొలేషన్ వార్డుకు తరలించారు. దిల్లీ నుంచి వచ్చిన కుటుంబాన్ని కలిసిన ఓ వ్యక్తిని 14 రోజులు తాడేపల్లిగూడెంలో క్వారంటైన్‌లో ఉంచి.... శనివారం ఉదయం గ్రామానికి పంపారు. అయితే మధ్యాహ్నం 2 గంటల సమయంలో అతడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. జిల్లా వైద్యాధికారుల సమాచారంతో అప్రమత్తమైన రెవెన్యూ, పోలీసు అధికారులు వెంటనే అతడిని ఏలూరు తరలించారు.  

కర్నూలు జిల్లాలో

కర్నూలు జిల్లాలో చాపకింద నీరులా విస్తరించిన కరోనా భయం పుట్టిస్తోంది. కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్‌ ఇంట్లోనే ఆరుగురు బాధితులు ఉండటం జిల్లాలో పరిస్థితికి అద్దంపడుతోంది.  జిల్లాలో కర్నూలు నగరం తర్వాత తర్వాత అత్యధిక కేసులు నమోదవుతున్న  నంద్యాలలో పరిస్థితి రోజురోజులు వణుకుపుట్టిస్తోంది. ఇప్పటికే ఓ వార్డు సచివాలయ ఉద్యోగికి వైరస్‌ సోకగా.. తాజాగా మరో వార్డు వాలంటీర్‌లో కరోనా లక్షణాలు గుర్తించారు. పోలీసులు ఎక్కడికక్కడ అవగాహన కల్పిస్తున్నారు. ఇళ్లవద్దకే నిత్యావసరాలు సరఫరా చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.  

చిత్తూరు జిల్లాలో

చిత్తూరు జిల్లాలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. జిల్లాలో 73 కేసులుంటే అత్యధికంగా శ్రీకాళహస్తిలో 43, తిరుపతి నగరంలో 8 మంది బాధితులను గుర్తించారు. ఇప్పటివరకూ 13మంది డిశ్ఛార్జ్ కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 60కి తగ్గింది. కేసులు నమోదైన ప్రాంతాలను పూర్తి స్థాయిలో రెడ్ జోన్లుగా పరిగణిస్తూ అధికారులు పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ప్రజలెవరూ రాకుండా సత్యవేడు, నగరి, పలమనేరు, కుప్పం, మదనపల్లె నియోజక వర్గాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. ఆదివారం పూర్తిస్థాయిలో మాంసం దుకాణాలు బంద్‌ చేశారు. కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తిస్తూ వారిని క్వారంటైన్లకు తరలిస్తున్నారు. శ్రీకాళహస్తిలో హై అలర్ట్ ప్రకటించగా, ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా సహకరించాలంటూ  పెద్దఎత్తున పోలీస్ వాహనాలతో సైరన్ మోగిస్తూ ర్యాలీ చేశారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా కేసుల ప్రభావంతో నెల్లూరు జిల్లా సరిహద్దు వెంకటగిరి పట్టణం చెక్‌పోస్ట్ వద్ద నిఘా తీవ్రతరం చేశారు. ఉదయం పూట దుకాణాలు నిర్వహించే వేళల్లో మాత్రమే జనం రోడ్లపై కనిపిస్తున్నారు. మిగిలిన సమయంలో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తిరుపతి నుంచి వెంకటగిరి మీదుగా వెళ్లే 565 నెంబర్ జాతీయ రహదారి వెలవెలబోతోంది.

ఇదీ చదవండి :  అయ్యో.. కృష్ణా!... ఒక్క రోజే 52 కేసులు


 

Last Updated : Apr 27, 2020, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details