ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యువతపై పంజా విసురుతున్న కరోనా - ap covid cases

పట్టపగ్గాల్లేని వయసు... అదే అదునుగా దాడి చేస్తోంది వైరస్. తమకు ఏమీకాదంటూ కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరిస్తున్న యువతపై పంజా విసురుతోంది. నిర్లక్ష్య ధోరణికి తప్పదు భారీ మాల్యం అంటూ యువ జనులను రోగులుగా మార్చుతోంది. ఫలితంగా వారి కుటుంబీకులు, సన్నిహితులూ మహమ్మారి బారిన పడుతున్నారు

Corona having a high impact on youth
యువతపై పంజా విసురుతున్న కరోనా

By

Published : Sep 6, 2020, 7:18 AM IST

యువతపై కరోనా పంజా విసురుతోంది. వైరస్‌ సోకినా ఏమీ కాదన్న నిర్లక్ష్య ధోరణి వారిని బాధితులను చేస్తోంది. ఫలితంగా వారి కుటుంబీకులు, సన్నిహితులు కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత యువత విచ్చలవిడిగా తిరగడం, మాస్కులు లేకుండా వాహనాలపై ముగ్గురేసి ప్రయాణించడం వ్యాధి విస్తృతికి కారణమవుతోంది. ఇంటినుంచి బయటకు వెళ్లడంపై మధ్యవయస్కులు, వృద్ధులు విముఖంగానే ఉంటున్నారు. కొందరు యువకులు మాత్రం పట్టపగ్గాల్లేకుండా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెలలో నమోదైన 2,94,930 మంది బాధితుల్లో 40 ఏళ్లలోపు ఉన్నవారు 55.33% మంది ఉన్నారు. ముఖ్యంగా 21 నుంచి 30 ఏళ్ల మధ్య వారు ఎక్కువగా బాధితులవుతున్నారు. యువకులకు వైరస్‌ సోకితే వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వివరాలను సేకరించడం కూడా కష్టమవుతోంది. వారు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తేనే వ్యాధిని కొంతవరకైనా నియంత్రించవచ్చని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

నిర్ధారణ పరీక్షలనూ విస్మరిస్తున్నారు..

ఉపాధి, ఉద్యోగాల కోసం బయట తిరిగే క్రమంలో కొందరు యువకులు వైరస్‌ బారిన పడుతున్నారు. జల్సాల కోసం తిరుగుతున్న యువకులు మాస్కులు ధరించడం, ఎడం పాటించడాన్ని విస్మరిస్తున్నారు. యువకుల్లో చాలా మందికి అనుమానిత లక్షణాలు కనిపించడం లేదు. ఒకవేళ లక్షణాలు కనిపించినా నిర్ధారణ పరీక్షలకు ప్రాధాన్యమివ్వడం లేదు. ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల రక్తపోటు, మధుమేహంలాంటి దీర్ఘకాల వ్యాధులున్న కుటుంబంలోని పెద్దలకు వైరస్‌ త్వరగా అంటుకుంటోంది. వారు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. మహమ్మారి దుష్ఫలితాలు తెలిసి యువకులు పట్టనట్లు వ్యవహరిస్తుండడం ఆందోళనకరమని విశాఖ ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుధాకర్‌ అన్నారు. ఒక్కరు వైరస్‌ బారినపడ్డా కుటుంబీకులందరికీ నెలపాటు ఆందోళన తప్పదని వివరించారు. కుటుంబమంతా బాధితులైతే ఏర్పడే క్లిష్ట పరిస్థితులు వర్ణనాతీతమన్నారు. కుటుంబంలోని పెద్ద వయసువారికి వైరస్‌ సోకడానికి కారణాలను తెలుసుకున్నప్పుడు ఇంట్లో ఉండే యువకులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఒక కారణంగా గుర్తించామన్నారు. 21 నుంచి 30 ఏళ్లలోపు యువతుల్లో బాధితులు తక్కువే ఉంటున్నారు.

తారతమ్యాలు లేవు..

వైరస్‌ సోకడానికి వయసు తారతమ్యాలేవీ లేవని కర్నూలు జీజీహెచ్‌ జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ నర్సింహులు తెలిపారు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారిని వైరస్‌ మరింత ఇబ్బంది పెడుతోందన్నారు. నంద్యాల సమీప గ్రామానికి చెందిన 28ఏళ్ల యువకుడు లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే ఉన్నాడని, ఆ తరువాత బాగా తిరగడంతో ఆయన వల్ల కుటుంబీకులు ఐదుగురికి వైరస్‌ సోకిందని ఒక వైద్యుడు తెలిపారు. బాధితుల్లో 20శాతం యువకులేనని అనంతపురం జీజీహెచ్‌ జనరల్‌ ఫిజీషియన్‌ వెంకటేశ్వరరావు తెలిపారు. స్వీయ గృహనిర్బంధంలో ఉండేవారిలో 40ఏళ్లలోపు వారే ఎక్కువని రాష్ట్ర కొవిడ్‌ నియంత్రణ కేంద్రం అధికారి ఒకరు చెప్పారు. యువతలో మార్పు వస్తేనే వ్యాప్తిని అడ్డుకోవచ్చని కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ పర్యవేక్షకులు వివరించారు.

ఇదీ చదవండి:ఈజ్​ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో ఏపీ టాప్

ABOUT THE AUTHOR

...view details