విద్యారంగంపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రైవేటు టీచర్లను ఉపాధి కూలీలుగా మార్చింది. రేపటి తరాన్ని తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేక యాజమాన్యాలు వారిని తొలగిస్తుంటే.. పొట్ట కూటి కోసం వారు వీధి వ్యాపారులగా, కూలీలుగా మారుతున్నారు. తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సినవారు... తట్ట, పార పట్టుకుని పొలంలో పనులకు వెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ప్రైవేటు టీచర్ల దయనీయస్థితి ఇది.
- దుస్తులు అమ్ముతూ...
నెల్లూరుకు చెందిన మీరామొహీ యుద్దీన్ ఉపాధ్యాయ ఉద్యోగం పోవడంతో రోడ్డుపక్కన దుస్తులు విక్రయిస్తున్నారు. టీషర్టులు, ప్యాంట్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు దుస్తులను రోడ్డుపక్కన పెట్టుకుని ఎదురుచూస్తారు. ఎవరైనా కొంటే ఆరోజు ఇల్లు గడుస్తుంది. లేదంటే ఇక చెప్పేదేముంది.
- ఆకలి తీరుస్తున్న ‘సంకల్పం’
రాజమహేంద్రవరానికి చెందిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు ఉద్యోగం పోవడంతో తనకు తెలిసిన పౌరోహిత్యం చేపట్టారు. గోదావరి గట్టున సంకల్పాలు చేయిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.
* కాకినాడకు చెందిన మరో గణిత ఉపాధ్యాయుడు ప్రైవేటు ఆస్పత్రిలో సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పీపీఈ కిట్లు ధరించి, ఆసుపత్రి భద్రత విధులు నిర్వర్తిస్తున్నారు.
- పాతికేళ్లుగా బోధన...కూలీగా వేదన
ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కోటయ్యనగర్‌కు చెందిన తాటితోటి రమణయ్యను కరోనా రోజు కూలీగా మార్చేసింది. 25 ఏళ్లుగా ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేసిన రమణయ్య ఇప్పుడు నిత్యం కూలికి వెళ్తున్నారు. గత నెల వరకు ఉపాధి హామీ పనులు చేయగా ఇప్పుడవి ఆగిపోవడంతో ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళుతున్నారు. కరోనా ముందువరకు రూ.18వేల జీతం వచ్చేది.
- బాధను దిగమింగి... బాధితులకు సహాయకారిగా...