ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సూర్యాపేట టూ వనస్థలిపురం.. వయా సరూర్‌నగర్‌ - హైదరాబాద్ లో కరోనా

హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలోని వనస్థలిపురం, సరూర్​ నగర్​ సమీప కాలనీల్లో కరోనా పాజిటివ్​ కేసులు బయటపడటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాపార పనుల నిమిత్తం సూర్యాపేటకు వెళ్లొచ్చిన ఒకరి వల్లే 12 మందికి సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఈ 12 మందిలో 11 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.

CORONA IN VANASTHALIPURAM
వనస్థలిపురంలో కరోనా కలకలం

By

Published : May 4, 2020, 8:23 AM IST

హైదరాబాద్‌ మహానగరం పరిధిలోని వనస్థలిపురం, సరూర్‌నగర్‌ సమీప కాలనీల్లో నూనెలు, పాలు, కిరాణా, కూరగాయలు విక్రయించే రక్త సంబంధం ఉన్న 3 కుటుంబాల్లో 11 మందికి కరోనా సోకగా.. వారిలో తండ్రీకొడుకు చనిపోయారు. ఈ కుటుంబం వద్ద సరకులు కొనుగోలు చేసిన దాదాపు 169 మందిని ఇప్పటికే హోం క్వారంటైన్‌లో ఉంచగా మిగిలిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.

బయటపడిందిలా..

కొద్ది రోజుల కిందట సరూర్‌నగర్‌కు చెందిన ఒక వ్యక్తికి జ్వరం లక్షణాలు ఉండడం వల్ల వనస్థలిపురంలో నివసిస్తున్న తన సోదరుని ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో ఆయనను స్థానిక ఆసుపత్రిలో పరీక్షించి అనంతరం గాంధీలో చేర్చగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆయన భార్య, కుమారుడికి సైతం వైరస్‌ సోకింది. ఈలోపు ఆయన తండ్రి వనస్థలిపురంలో స్నానాల గదిలో జారి పడటం వల్ల గాంధీలో చికిత్స పొందుతూ చనిపోయారు.

అనంతరం ఆయనకు పరీక్ష చేయగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. వనస్థలిపురంలోనే ఉండే ఇతని రెండో కుమారుడు సైతం ఇదే మహమ్మారితో 3 రోజుల క్రితం చనిపోగా కుటుంబంలోని మరో నలుగురు గాంధీలో చికిత్స పొందుతున్నారు. ఎస్‌కేడీనగర్‌లో ఉంటున్న వృద్ధుడి కుమార్తెకు, ఆమె కుమారుడికి సైతం కరోనా ఉన్నట్లు తేలింది. తాజాగా ఆదివారం వనస్థలిపురంలోని హుడాసాయినగర్‌లో ఉంటున్న ఓ వృద్ధురాలికి వైరస్‌ నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.

ఎందరికి చుట్టుకుంటుందో..

కరోనా వైరస్‌తో చనిపోయిన తండ్రీకొడుకులకు వనస్థలిపురంలో కిరాణా దుకాణం ఉంది. కిరాణంతో పాటు పాలు, వనస్థలిపురం రైతుబజార్‌ నుంచి కూరగాయలు తెచ్చి విక్రయిస్తుంటారు. దాదాపు 300 మంది వరకు నిత్యం వీరి వద్ద సరకులు కొనుగోలు చేస్తుంటారని స్థానికులు తెలిపారు. వీరిలో 169 మందిని గుర్తించిన అధికారులు వారిని హోం క్వారంటైన్‌లో ఉంచారు.

మిగిలిన వారితో పాటు రైతుబజార్‌లో వీరికి కూరగాయలు విక్రయించిన రైతులు, వ్యాపారులను గుర్తించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. తాజాగా కరోనా బారినపడిన వృద్ధురాలు వీరి వద్ద పాలను కొనుగోలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అనేక మంది దుకాణానికి వచ్చే వారితో పాటుగా చాలా మంది అక్కడ కూర్చుని వీరితో సన్నిహితంగా మెలిగేవారని విచారణలో తేలింది.

వైరస్‌ సోకింది ఇలా..

సరూర్‌నగర్‌లో ఉండే వృద్ధుడి పెద్ద కుమారుడు హోల్‌సేల్‌ నూనె వ్యాపారం చేస్తుంటారు. సూర్యాపేటలో పెద్దఎత్తున పల్లీలను కొనుగోలు చేసి సరూర్‌నగర్‌లో నూనెగా ఆడించి దాన్ని మలక్‌పేట గంజ్‌లో విక్రయిస్తుంటారు. సూర్యాపేటలోనే ఇతనికి వైరస్‌ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే మలక్‌పేట్‌ గంజ్‌ని మూసివేసిన అధికారులు ఇక్కడి వ్యాపారులను గుర్తించే పనిలో ఉన్నారు.

రైతుబజార్‌ మూసివేత..

కరోనా విజృంభణ నేపథ్యంలో వనస్థలిపురం రైతుబజార్‌ను సోమవారం నుంచి మూసి వేయాలని అధికారులు నిర్ణయించారు. వనస్థలిపురంలోని ఎస్‌కేడీనగర్‌, ఏ, బీ టైపు క్వార్టర్స్‌, ఫేజ్‌-1, హుడాసాయినగర్‌లోని కొన్ని వీధులను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు.

రైతుబజార్‌ పరిసరాలు, క్రాంతిహిల్స్‌, సుష్మాసాయినగర్‌, కమలానగర్‌, సచివాలయనగర్‌, సాహెబ్‌నగర్‌ ప్రాంతాల్లో కొన్ని వీధులను కంటైన్మెంట్‌ జోన్లుగా సోమవారం ప్రకటించనున్నట్లు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:వలస కూలీలు తప్ప ఎవరూ రావొద్దు : సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details