గ్రామీణ ప్రజలకు కరోనా కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కొవిడ్ రెండో దశలో నగరాలు, పట్టణాల్లో వ్యాధి తీవ్రత పెరిగి కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తుండగా.. గ్రామాల్లో మాత్రం కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పట్టణాలు, నగరాలకు సమీపంలోని గ్రామాల్లో ఎక్కువమంది వైరస్ బారిన పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉన్నవారు...కర్ఫ్యూతో పనులు లేక పల్లెలకు వస్తున్నారు. మాస్కులు ధరించకపోవడం, ఎడం పాటించకపోవడం, ఇతర జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 7 రోజుల వ్యవధిలో పట్టణాలు/నగరాల్లో 39%, గ్రామాల్లో 61% కేసులు నమోదయ్యాయి.
ఇవీ కారణాలు!
* చాలామందికి వైరస్ సోకినప్పటికీ... ఎవరికీ చెప్పకుండా బయట తిరుగుతున్నారు.
* వైరస్ సోకిన వారిలో కొందరు 2 వారాలపాటు ఇంట్లో ఉండకుండా బయటకు వస్తున్నారు.
* ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో పరిధికి మించి యథావిధిగా గుంపులుగా ప్రయాణాలు చేస్తున్నారు.
* పుట్టినరోజు, ఇతర వేడుకలు యథావిధిగా జరుగుతున్నాయి. వాటికి అధిక సంఖ్యలో హాజరవుతున్నారు.
* హోటళ్లు, టీ దుకాణాలవద్ద గుంపులుగా కనిపిస్తున్నారు. కబుర్లు తగ్గడంలేదు.
* బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద భౌతిక దూరం అనేది కనిపించడంలేదు.
* మద్యం దుకాణాలవద్ద ఉదయాన్నే బారులు తీరి కనిపిస్తున్నారు.
* ఉపాధి, వ్యవసాయ, వ్యవసాయేతర పనులకు వెళ్లే కూలీలు కొవిడ్ జాగ్రత్తలు పాటించడంలేదు.
* గ్రామాల్లోని ముఖ్య కూడళ్లలో పాతరోజుల్లో మాదిరిగానే యువకులు, పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు.
* ఆరోగ్య సిబ్బంది కనిపించినప్పుడు మాత్రమే మాస్కులు ధరిస్తున్నారు.
* కరోనా జాగ్రత్తలపై కిందటేడు అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు కనిపించడంలేదు.
గ్రామీణం విలవిల..
విశాఖ జిల్లాలో ప్రశాంతంగా ఉండే మన్యంలో కరోనా తొలిదశలో 3వేల కేసులు నమోదయ్యాయి. రెండో దశలో ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటికే 3,295 కేసులు వచ్చాయి. చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో తొలిదశలో 376 కేసులు నమోదుకాగా...రెండో దశలో ఇప్పటివరకు 1,066 కేసులు రికార్డయ్యాయి. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల ద్వారా 56 మందికి పరీక్షలు చేయగా 28 మందికి వైరస్ సోకింది. విజయనగరం జిల్లా తెర్లాం మండలంలో గత మార్చి నెలలో ఒక కేసు వచ్చింది. ఏప్రిల్‌లో 125 కేసులు వచ్చాయి. ఈ నెలలో ఇప్పటివరకు 1,240 కేసులు నమోదు కావడం గమనార్హం. అలాగే గజపతినగరంలో గత మార్చి నెలలో 6, ఏప్రిల్‌లో 158 చొప్పున కేసులొచ్చాయి. ఈ నెలలో ఇప్పటివరకు 1,273 కేసులు రికార్డయ్యాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో రెండో విడతలో 300 కేసులు రికార్డయ్యాయి. వీరిలో 25 మందిమృత్యువాతపడ్డారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో తొలిదశలో 962, రెండో దశలో ఇప్పటివరకు 1,355 చొప్పున నమోదైన కేసులు వైరస్ వ్యాప్తి స్పష్టంచేస్తున్నాయి. అలాగే కలికిరిలో తొలిదశ 965 కేసులు వస్తే..రెండో దశలో ఇప్పటికే 989 కేసులొచ్చాయి. తిరుపతి గ్రామీణ, చంద్రగిరి పలమనేరు, పీలేరు, వడమాలపేట, ఇతరచోట్ల కూడా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఇరిడి గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకునే గిరిజనులకు పరీక్షలు నిర్వహిస్తే ఒకేరోజు 20 మందికి వైరస్ సోకింది. పనుల్లో భాగంగా మట్టి తట్టలను ఒకరి నుంచి మరొకరు పట్టుకునే క్రమంలో వీరంతా వైరస్ బారినపడ్డారు. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నా...సాధారణ రోజుల్లో మాదిరిగానే గ్రామీణులు వ్యవహరిస్తున్నారని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుహాసిని అన్నారు. ఇంటింటి సర్వేకు వెళ్లినప్పుడు జ్వరాలు వచ్చిన వారి వివరాలు అడిగితే చెప్పేందుకు వెనుకంజవేస్తున్నారని అంటున్నారు.
పట్టణాల నుంచి గ్రామాలకు...!
* ఏప్రిల్ 11 నుంచి 17వ తేదీ మధ్య పట్టణాల్లో 61%, గ్రామాల్లో 39% చొప్పున కేసులు నమోదయ్యాయి.
* మే 2వ వారంలో పట్టణాల్లో 44%, గ్రామాల్లో 56% చొప్పున కేసులు వచ్చాయి.
* మే 16 నుంచి 22వ తేదీ మధ్య నమోదైన 1,42,708లో పట్టణాల్లో 56,058(39%), గ్రామాల్లో 86,649 (61%) చొప్పున కేసులు రికార్డయ్యాయి.
* మృతుల్లో 51.7% మంది గ్రామాల్లో, 48.3% మంది పట్టణాల్లో ఉన్నారు.
తేడా కనిపించడంలేదు
వైరస్ సోకిన వ్యక్తులు, సాధారణ వ్యక్తులు అన్న తేడా లేకుండా కలిసిపోతున్నారు. నిత్యావసర వస్తువుల కోసం పట్టణాలు, పల్లెల మధ్య రాకపోకలు జరుగుతున్నాయి. కొందరు గ్రామీణుల్లో అవగాహనారాహిత్యం వల్ల కూడా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు అవసరమైన నిధులు మా వద్ద ఉండడంలేదు.
- చంద్రశేఖర్, సర్పంచి పేట అగ్రహారం, చిత్తూరు జిల్లా
యథావిధిగా రాకపోకలు..