ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సంప్రదాయాలపై కరోనా విలయం.. అనాథలా అంతిమయాత్ర - అనాథలా కొవిడ్ మృతదేహాల అంతిమయాత్ర

కరోనా కాటుకు బలైన వారికి ఆత్మీయ వీడ్కోలు దూరమైంది. అందరూ ఉన్నా అనాథలా ఆ దేహం శ్మశానానికి చేరుకుంటోంది. మానవ సంబంధాల విధ్వంసాన్ని వైరస్‌ మహమ్మారి పతాక స్థాయికి చేర్చింది. రక్త సంబంధీకుడు, బంధువు, స్నేహితుడు తిరిగిరాని లోకాలకు వెళ్లారని తెలిసి కూడా కుటుంబీకులు ఏమీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Corona effect on traditions of funerals
అంతిమయాత్ర సంప్రాదాయాలపై కొవిడ్ ఎఫె

By

Published : Jun 7, 2021, 7:12 AM IST

అంతిమయాత్ర సంప్రాదాయాలపై కొవిడ్.. విలయం సృష్టిస్తోంది. దూరమైన ఆత్మీయుడి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కుమిలిపోవడం తప్ప చివరి క్షణాల్లో స్పర్శించే అవకాశం కూడా చిక్కడం లేదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కర్మక్రతువు జరపలేదని పిల్లలు, జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసినవాడిని కాస్త కదల్చాలని తపించే అర్ధాంగి, తోడబుట్టినవాడు చనిపోతే పాడె మోసే నలుగురిలో లేకపోయామన్న రక్తసంబంధీకుల ఆత్మఘోష విషాదానికి పరాకాష్టగా నిలుస్తోంది. తీరని వేదన వారి మనసు పొరల్లో గూడు కట్టుకుంటోంది. అందరూ ఉండీ చివరి క్షణాల్లో ఆ నలుగురినీ డబ్బులిచ్చి సమకూర్చుకునే దయనీయ పరిస్థితి కనిపిస్తోంది.

ఒంటరి పయనం

కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించడానికి పట్టణాల్లో స్వచ్ఛంద సంస్థలు కొన్ని ముందుకు వస్తున్నాయి. గ్రామాల్లో మాత్రం పరిస్థితి దయనీయంగా ఉంది. కరోనా సోకిందని తెలిస్తే.. సాయంగా ఉండాల్సిన బంధువులు ఇంటి వైపు తొంగిచూడటం లేదు. ఇంట్లో పనులు చేయడం, ఇతర అనుబంధాలు ఉన్నవారు కూడా రావడం లేదు. అప్పటివరకు బంధువులు తోడున్నారన్న ధీమాతో ఉన్న వారు ఒంటరి అవుతున్నారు. ఉపాధి వేటలో దూర ప్రాంతాలకు వెళ్లిన పిల్లల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. అందరూ ఉన్నా అనాథలైన శవాలకు కొన్నిచోట్ల నలుగురైదుగురు సభ్యుల బృందం వచ్చి అంతిమ సంస్కారాలను నిర్వహిస్తోంది. ఖననానికి రూ.15 వేలు, దహన సంస్కారాలకు రూ.30 వేలను వారు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒక్కోచోట నాలుగైదు బృందాలు ఈ కార్యక్రమాన్ని ఉపాధిగా ఎంచుకున్నాయి.

గ్రామాల్లో పరిస్థితి దయనీయం

అనంతపురం బెళుగుప్ప మండలానికి చెందిన ఒకరు ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. కుటుంబంతో కలిసి అనంతపురంలో నివసిస్తున్నారు. ఆయన తల్లి ఒక్కరే బెళుగుప్పలో ఇంట్లో ఉంటున్నారు. కరోనా సోకటంతో గ్రామంలో ఉన్న బంధువులెవరూ ఆమె ఇంటికి వెళ్లలేదు. ఉద్యోగానికి సెలవు పెట్టి కుమారుడు తల్లి వద్దకు వెళ్లారు. ఒకరోజు రాత్రి 10గంటల సమయంలో గుండెనొప్పిగా ఉందని తల్లి చెప్పటంతో కళ్యాణదుర్గంలోకి ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బంధువుల సాయాన్ని కోరారు. వారెవరూ స్పందించలేదు. అంబులెన్సు కోసం ప్రయత్నిస్తుండగానే రాత్రి 11 గంటలకు తల్లి మరణించారు. విషయం తెలిసిన బంధువులు ఇంటి సమీపంలో కొద్దిసేపు రోడ్డుపై నిల్చొని వెళ్లారు. రాత్రంతా ఒక్కడే తల్లి శవంతో జాగారం చేసి తర్వాత రోజు ఉదయం అనంతపురం నుంచి బృందాన్ని పిలిపించి అంత్యక్రియలు చేశారు.

బెళుగుప్ప మండలంలోని ఒక గ్రామానికి చెందిన కుటుంబానిది కూడా ఇలాంటి దయనీయ పరిస్థితే. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కరోనా సోకి ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. కుటుంబీకుల కడసారి చూపులకు మృతదేహాన్ని అంబులెన్సులో గ్రామానికి తీసుకొచ్చారు. అంత్యక్రియలను నిర్వహించడానికి ఆయన సోదరుడు, బంధువులు ముందుకు రాలేదు. రూ.30 వేలు తీసుకొని అనంతపురం నుంచి వచ్చిన బృందం దహన సంస్కారాలను చేసింది.

ఇదీ చదవండి:

మంత్రి ఆదేశాలతో.. బ్లాక్ ఫంగస్ బాధితురాలికి వైద్యం

ABOUT THE AUTHOR

...view details