గతేడాది నెలకొన్న పరిస్థితుల్లో పిల్లలను విద్యాలయాలకు పంపేందుకు 80 నుంచి 90 శాతం మంది నగరంలోని తల్లిదండ్రులు ససేమిరా! అన్నారు. ఒక ఏడాది చదువు దూరమైనా బిడ్డలు సురక్షితంగా ఉండటానికే ప్రాధాన్యమిచ్చారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక మొదట్లో కాస్త తటపటాయించినా క్రమంగా పాఠశాల వైపు మొగ్గుచూపారు. దాంతో 85 శాతం పైగా హాజరు పెరిగింది. రేపటిపై ఆశతో ముందుకెళ్తోన్న వేళ అకస్మాత్తుగా కరోనా కేసులు పెరగటం, విద్యాసంస్థలకు తాత్కాలిక సెలవులు, పరీక్షల వాయిదా వంటివి మళ్లీ కన్నపేగులో కలవరం కలిగిస్తున్నాయి.
అందరిదీ అదే బాధ..
ఇటీవల పెద్ద కుమారుడిని ఎంటెక్, కూతుర్ని బీటెక్‌లో చేర్చిన ప్రభుత్వ ఉద్యోగి చంద్రశేఖర్ బిడ్డల భవిష్యత్తుపై అయోమయంలో ఉన్నాననంటూ తెలిపారు. లక్షలాది రూపాయలు ఫీజు చెల్లించినా! వాటిని వృథా చేస్తున్నామా! అనే అనుమానం తనను మరింత ఇబ్బందికి గురిచేస్తోందంటూ వివరించారు. ప్రైవేటు ఉపాధ్యాయురాలు శశికళ పరిస్థితీ అదే. తమనే భయం వెంటాడుతున్నపుడు బిడ్డలకు ఎలా దైర్యం నింపాలనే అనుమానం వ్యక్తం చేశారు. అయోమయ పరిస్థితుల నుంచి బయటపడటం తనలాంటి మధ్య తరగతి కుటుంబాల్లోని తల్లులకు సవాల్‌గా ఉందని వివరించారు.
అంతా బాగుందనుకొన్న వేళ..
కన్నవారిలో ఉన్న ఆదుర్దాను మించిన ఆందోళన యువతలో నెలకొంది. నాలుగైదు నెలల కిందట పోటీ పరీక్షలు, కంప్యూటర్ కోర్సులకు శిక్షణ కోసం వచ్చిన యువత క్రమంగా ఇంటి ముఖం పడుతున్నారు. శిక్షణ కేంద్రాలు మళ్లీ బోసిపోతున్నాయి. ఎస్సార్‌నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, యూసుఫ్‌గూడలో శిక్షణ కేంద్రాలు, వసతిగృహాలు కళతప్పాయి. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతలో నిస్తేజం నెలకొందని ఓ మనస్తత్వ నిపుణుడు వివరించారు. మార్చి నుంచి ఏప్రిల్ 7 వరకు తన వద్దకు వచ్చిన 50 మంది యువతలో 40 మంది తమకు జీవితంపై నమ్మకం సన్నగిల్లుతోందని ఆందోళన వెలిబుచ్చారన్నారు. 8 మంది ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయంటూ చెప్పారని ఆందోళన వ్యక్తంచేశారు.
నమ్మకంతోనే నడవాలి
ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త అయోమయ వాతావరణ ఉండటం సహజమేనంటున్నారు ప్రముఖ మనస్తత్వ విశ్లేషకురాలు డాక్టర్ గీతా చల్లా. దీనికి ఒక్కటే పరిష్కారమార్గమన్నారు. రేపటిపై బోలెడంత నమ్మకముండాలన్నారు. ఇప్పటి వరకూ ఇటువంటి ఎన్నో ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ప్రపంచంలో వచ్చిపోయాయన్నారు. ఏవీ శాశ్వతంగా లేవని, కరోనా కూడా వచ్చిపోయే ఒక రుగ్మత మాత్రమే అని గుర్తుంచుకోవాలన్నారు. కొద్దికాలం ఉండి.. క్రమంగా దూరమవుతుందనే నమ్మకంతో నడవాలన్నారు. కన్నవారిలో కనిపించే నమ్మకమే బిడ్డలకూ రేపటిపై ఆశను కలిగిస్తుందని ఆమె విశ్లేషించారు.
ఇదీ చూడండి:క్లైమాక్స్‌కు తిరుపతి ఉపఎన్నిక ప్రచారం..17న పోలింగ్