ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ప్రభావం.. మందగించిన రెవెన్యూ వసూళ్లు - ఏపీలో కరోనా ప్రభావం

రాష్ట్రంలో 2021-22 బడ్జెట్‌ రూపకల్పనకు సంబంధించి మార్గదర్శకాల తయారీపై ఆర్థికశాఖ అధికారులు కసరత్తు సాగిస్తున్నారు. డిసెంబర్‌లోనే వాటిని విడుదల చేయాల్సి ఉన్నా కొన్ని ఖాతాలు రద్దు చేసి కొత్తవి ఏర్పాటుచేసే పనిలో ఉన్నారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక బడ్జెట్‌ ప్రాధాన్యాలు, ఏయే అంశాలు చేర్చాలి? ప్రతిపాదనలు ఏ రూపంలో సమర్పించాలి? తదితర అంశాలపై మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

budget
budget

By

Published : Dec 29, 2020, 8:19 AM IST

ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు గమనిస్తే రాబోయే ఏడాది ప్రతిపాదించనున్న బడ్జెట్‌ కసరత్తు పెద్దసవాల్‌గానే ఉండేలా ఉందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 2020-21 పూర్తి బడ్జెట్‌ సమర్పించే సమయానికే ఆర్థిక పరిస్థితి క్షీణించింది. లాక్‌డౌన్‌లో ఉన్న సమయంలోనే నాటి బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆ బడ్జెట్‌లోనే కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించుకున్న మేరకు ఖర్చు చేసేందుకు వెసులుబాటు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రెవెన్యూ వసూళ్లు బాగా మందగించాయి. ఆర్థిక కార్యకలాపాల్లేక ఆశించిన మేర ఆదాయాలు లేవు. సెప్టెంబరు నుంచి పరిస్థితులు కొంత మెరుగుపడుతూ వస్తున్నాయి. ఏ రూపేణా అంచనాలు రూపొందించిన మేరకు రాబడుల్లేకుండా పోయాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది ఆర్థికవ్యవస్థ ఎప్పటికి కుదుటపడుతుందనేది ప్రశ్నార్థకమే. మరోవైపు నవరత్నాల రూపంలో కచ్చితంగా ఏడాదికి ఎంత ఖర్చు అవుతుందో అందుకు కేటాయింపులు చూపాల్సి ఉంది. అది దాటి చేసే ఖర్చుల విషయంలో ఎంతవరకు ముందుకు వెళ్లగలరనేది చర్చనీయాంశమవుతోంది.

రెవెన్యూ వసూళ్లను వాస్తవరూపంలో లెక్కించి బడ్జెట్‌ రూపకల్పనపై దృష్టిసారించాలని భావిస్తున్నారు. ఏటా అంతకుముందు సంవత్సరం బడ్జెట్‌ కన్నా సాధారణ పరిస్థితుల్లోనే 10-15శాతం మేర అంచనాలు పెంచుతుంటారు. 2020-21 పూర్తిస్థాయి బడ్జెట్‌ అంతకుముందు ఏడాది స్థాయికే పరిమితమైంది. వచ్చే ఆర్థికసంవత్సరానికి ప్రతిపాదించే బడ్జెట్‌కు తాజా పరిస్థితుల నేపథ్యంలో అనేక పరిమితులున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. తాజా సవాల్‌కు, రాష్ట్ర అవసరాలకు మధ్య సమతుల్యం సాధించడమే రాబోయే బడ్జెట్‌కు పెనుసవాల్‌ అని అభిప్రాయపడుతున్నారు.

కొత్త ఖాతాలకు రూపకల్పన

ఆంధ్రప్రదేశ్‌లో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో కలగూరగంప ఖర్చులకు అవకాశం లేకుండా ఆఫీసు నిర్వహణ తదితరాలకు సంబంధించి స్టేషనరీ, పేపర్‌ వినియోగం, సెల్‌ఫోన్లు, అద్దె వాహనాల వినియోగం తదితరాలకు ఏ కేటగిరీ కింద ఎంత ఖర్చు చేస్తున్నారో? ఎంత కేటాయింపులు కోరుతున్నారో విడివిడిగా చూపేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కిందటి ఏడాది ప్రభుత్వశాఖల్లో కార్యాలయ నిర్వహణకు సంబంధించిన ఖాతా 132ను రద్దుచేశారు.

ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, ఇతర సంస్థలకు సంబంధించిన నిర్వహణ ఖర్చుల కోసం ఉన్న 312వ ఖాతాను రద్దుచేసి వాటి స్థానంలో దేనికదే విడివిడిగా పద్దులు చూపేలా మార్పులు చేయబోతున్నారు. కొత్త ఖాతాలు సృష్టించబోతున్నారు. తర్వాత ఆ ఖాతాల నిర్వహణ, ప్రతిపాదనల తయారీపై అధికారులకు శిక్షణ ఇస్తారు.

ఇదీ చదవండి:

'న్యాయవ్యవస్థను ప్రశ్నించే పరిస్థితి రాకూడదు'

ABOUT THE AUTHOR

...view details