తెలంగాణలో కరోనా ప్రభావం వ్యవసాయ మార్కెట్లపై కూడా పడింది. పంటలు కొనలేం అని వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు. మరోవైపు మార్కెట్లకు సెలవు ఇవ్వాలా వద్దా అనే ప్రతిపాదన కూడా పరిశీలినలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే... నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు అమ్మకాలకు ఈ నెల 21 నుంచి విరామం ప్రకటించిన నేపథ్యంలో మిగతా ప్రాంతాలపైనా దృష్టి సారించారు. ప్రతి మార్కెట్‌కు వచ్చే రైతులకు కరోనా వ్యాప్తిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని మార్కెటింగ్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
మిరప ఘాటుకు తుమ్ములు..
తెలంగాణలో అతి పెద్దదైన వరంగల్ మార్కెట్‌కు పెద్ద ఎత్తున పత్తి, మిరప పంటను కర్షకులు తెస్తున్నారు. పంటతో వచ్చిన ప్రతి రైతుకు మార్కెటింగ్ శాఖ సిబ్బంది మాస్క్‌లను పంపిణీ చేస్తున్నారు. మిరప మార్కెట్‌లో ఘాటు కారణంగా విపరీతంగా తుమ్ములు, దగ్గులు రావడం సహజం. జలుబు సోకిన రైతులు ఎవరైనా మార్కెట్‌కి వస్తే.. ఇతరులకు ఇది కూడా వేగంగా వ్యాపిస్తుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మార్కెటింగ్ శాఖ అప్రమత్తం..
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతుబజార్లకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూరగాయలు కొనడానికి వెళ్తుంటారు. వినియోగదారులకు కరోనాపై అవగాహన కల్పించేందుకు బ్యానర్లు, ఫ్లెక్సీలపై సూచనలు ముద్రించి.. అవగాహన కల్పిస్తున్నారు. సిబ్బంది కూడా జాగ్రత్తగా ఉండాలని మార్కెటింగ్ శాఖ సూచించింది. రైతులు పెద్ద ఎత్తున గుమిగూడి ఉండకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతం పంటలు అధికంగా మార్కెట్లకు వచ్చే సీజన్ కాబట్టి... ఒకేసారి సెలవులు ప్రకటిస్తే పంటలు అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడతారని అధికారులు భావిస్తున్నారు.