రాష్ట్ర గ్రానైట్ పరిశ్రమ కరోనా ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదు. రెండేళ్లుగా బయ్యర్లు ముడిరాయిని తీసుకోవడం తగ్గించేశారు. ఇది లీజుదారులపై ప్రభావం చూపిస్తోంది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లభించే గెలాక్సీ రకం గ్రానైట్‌తో పాటు...చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో లభించే మరిన్ని రకాల లీజుల నుంచి విదేశాలకు ముడిరాయి ఎగుమతులు చాలావరకు తగ్గిపోయాయి. గ్రానైట్ రాయి ఎక్కువగా చైనాకు ఎగుమతి అవుతుండగా.. ప్రస్తుతం డిమాండ్ లేదంటూ ఆ దేశపు బయ్యర్లు తీసుకోవడం మానేశారు. దీనికి తోడు వివిధ రకాల రుసుములు పెరగడం, రాష్ట్ర ప్రభుత్వం లీజుదారులపై వివిధ రూపాల్లో అదనపు భారాలు వేయడంతో...గ్రానైట్ పరిశ్రమ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
గతంలో చీమకుర్తి నుంచి ఎక్కువగా గెలాక్సీ రకం గ్రానైట్ చైనాకు ఎగుమతయ్యేది. అక్కడి బయ్యర్లు ముడిరాయిని తీసుకెళ్లి కటింగ్, పాలిషింగ్ చేసి....సరకులో సగం దాకా ఆ దేశంలోనే సరఫరా చేసే వారు. మిగిలినదాన్ని విదేశాలకు ...ముఖ్యంగా ఐరోపాకు పంపించే వారు. ప్రస్తుతం ఆయా దేశాల్లో నిర్మాణ రంగం నెమ్మదించడంతో గ్రానైట్‌కు డిమాండ్ తగ్గింది. మరోవైపు చైనాలో విద్యుత్ కోతలతో అక్కడి జియామిన్ పోర్టుకు సమీపంలో ఎక్కువగా ఉండే గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లు మూతపడ్డాయి. కొవిడ్‌కు ముందు చీమకుర్తిలో లభించే గెలాక్సీ గ్రానైట్ ముడిరాయి గతంలో నెలకు 4 వెసల్స్ చైనాకు వెళ్లేవి. ఒక్కో వెసల్‌లో 60 వేల టన్నులు చొప్పున... నెలకు 2లక్షల 40 వేల టన్నులు ఎగుమతి అయ్యేది. ఇప్పుడు డిమాండ్ లేకపోవడం వల్ల ….నెలకు ఒక వెసల్ అతి కష్టంమీద వెళ్తోంది. ఈ పరిస్థితుల్లో చైనా బయ్యర్ల షరతులన్నింటికీ లీజుదారులు అంగీకరించాల్సి వస్తోంది.