వ్యవసాయం, ఉద్యాన పంటల్లో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో సాటి లేదు. వరి, మొక్కజొన్న, చెరకు, వేరుశనగ వంటి వ్యవసాయోత్పత్తులతో పాటు.. అరటి, మామిడి, కొబ్బరి, బొప్పాయి, జామ, నిమ్మ, జీడి, దానిమ్మ, టమోట, ఉల్లి, క్యారెట్, నూనె గింజల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి ఐదు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకుంది. ఐదున్నర కోట్ల జనాభాలో వ్యవసాయ రంగం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాదాపు 70 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంటే... దీనికి అనుబంధంగా ఉండే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలపై మరో 10లక్షలమంది ఆధారపడుతున్నారు.
ఆహార ధాన్యాలు, పాలు, పండ్లు, కూరగాయలు, పౌల్ట్రీ, ఆక్వా తదితర ఉత్పత్తులకు అటు రైతులకు ఇటు వినియోగదారులకు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వారధుల్లాంటివి. రాష్ట్రంలో దాదాపు 500కు పైగా ఉన్న యూనిట్లలో ఏటా 40వేల కోట్ల రూపాయల వరకూ ఉత్పత్తి జరుగుతుంది. వీటిలో 20వేల కోట్ల రూపాయల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతవుతుంటాయి. అయితే ఆర్థిక మాంద్యం, ఇతరత్రా సమస్యల వల్ల గతేడాది నుంచే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని కరోనా తీవ్రంగా దెబ్బతీసింది.
ప్రభుత్వం నిబంధనలు సడలించి ఉత్పత్తికి అవకాశం కల్పించినా.. పనిచేసే వారు అందుబాటులో లేకపోవటం వల్ల పునరుద్ధరణ సాధ్యం కావట్లేదు. ప్రభుత్వం నుంచి ఈ పరిశ్రమలకు రావాల్సిన ప్రోత్సాహకాలు దాదాపు 100కోట్ల రూపాయల పైనే ఉంది. వెంటనే వీటిని విడుదల చేసి విద్యుత్ ఛార్జీల మినహాయింపు లాంటివి ఇచ్చి సహకరిస్తే కొంతైనా కోలుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.