కరోనా వ్యాప్తి పూల విక్రయాలపైనా పడింది. ప్రస్తుతం వివాహ, శుభకార్యాలకు పూలకు గిరాకీ ఉండటంతో చాలా ప్రాంతాల్లో రైతులు పూలతోటలను పెంచుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 128 ఎకరాల్లో పూల తోటలు సాగవుతున్నాయి. కరోనా రెండోదశ వ్యాప్తితో శుభకార్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. కొంతమంది వివాహాలు వాయిదాలు వేసుకుంటే, మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో హంగూఆర్భాటం లేకుండా తంతు జరిపిస్తున్నారు. ఇతర శుభకార్యాలూ నామమాత్రమే. దేవాలయాల్లోకి ప్రజల అనుమతి లేకపోవడంతో పూజలూ తగ్గిపోయాయి. ఈ ప్రభావం పూల సాగుచేసే రైతులపై పడింది. కనీసం పెట్టుబడులు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి..
ప్రస్తుతం వివాహాల సీజన్ కావడంతో చామంతి, బంతి, మల్లి, కనకంబరాలను పండించారు. చామంతి నారు బెంగళూరు, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి జిల్లా వాసులు తెప్పించుకొని పాలీహౌస్‌లు ఏర్పాటు చేసుకొని నాటారు. చామంతి పూలకోతకు వచ్చేసరికి రైతులకు రూ.లక్షల్లో ఖర్చవుతుంది. ఈ ఏడాది మూఢం, తర్వాత కరోనా నేపథ్యంలో పరిస్థితి అనుకూలించలేదు. దీంతో విక్రయాలు మందగించాయి. ఈ పూలను జిల్లాలోని రాజాం, శ్రీకాకుళం, వీరఘట్టం, పాలకొండ తదితర ప్రాంతాలతోపాటు విశాఖ జిల్లాలోని అనకాపల్లి, విజయనగరం జిల్లా తగరపువలస తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితిలేదు.
నిరాశే మిగిలింది..