ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పది రెట్లు ధర పెంచి కరోనా మందుల అమ్మకం..! - telangana latest news

రెమ్‌డెసివిర్‌.. కరోనా వైరస్‌ లోడ్‌ ఎక్కువగా ఉన్నవారికి అత్యవసరంగా సూచిస్తున్న మందు. కొవిఫర్‌.. ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారికి ఇవ్వాల్సిన ఔషధం.. వీటిని కొనాలి అంటే లక్షలు వెచ్చించాల్సిందే. రోగుల అవసరాన్ని, వారి బంధువుల ఆందోళనను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. నల్లబజారులో వీటి ధరను ఏకంగా పదిరెట్లు పెంచి అమ్ముతున్నారు. ఇవే కాదు ఆక్సిజన్‌ నుంచి వ్యాక్సిన్ల దాకా ప్రతి దాంట్లోనూ నల్లదందా మొదలవడంతో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నవాళ్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

medicines in black market
బ్లాక్​లో కరోనా మందులు అమ్మకం

By

Published : Apr 27, 2021, 9:53 AM IST

కరోనా మందులు కొనుగోలు చేయడానికి రోగుల కుటుంబసభ్యులు పడుతున్న బాధ వర్ణనాతీతం. బ్లాక్‌మార్కెట్‌ రాజ్యమేలుతుండడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌కు నిర్ణయించిన ధర గరిష్ఠంగా రూ.3490 అయితే దాన్ని ఏకంగా రూ.35వేల నుంచి రూ.45వేలకు అమ్ముతున్నారు. జిల్లా కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో ఒకటి, రెండు ప్రధాన ఆసుపత్రులకు మాత్రమే కొంతమేర నేరుగా ఇంజక్షన్లు సరఫరా అవుతున్నాయి. కానీ మిగిలిన చోట్ల తప్పనిసరిగా బయట కొనాల్సిందే. చేరాక రెమ్‌డెసివిర్‌ తెచ్చుకోండి అని కొన్ని ఆసుపత్రులు సూచిస్తుంటే.. ఆ ఇంజక్షన్‌ తెచ్చుకుంటేనే చేర్చుకుంటామని మరికొన్ని చెబుతున్నాయి. దీంతో రోగుల కుటుంబ సభ్యులకు దిక్కుతోచడం లేదు. ధర ఎంతైనా చెల్లించి నల్లబజారులో కొనుగోలు చేయాల్సి వస్తోంది.

హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్నవారికి ఒక్కొక్కరికి ఆరు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు చేయాలని చెబుతున్నారు. వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో ఉన్న తన బంధువు కోసం ఒక్కొక్కటి రూ.22వేల చొప్పున మూడు, రూ.25వేల చొప్పున మూడు కొనుగోలు చేశారు. ఆదివారం నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి వివిధ మార్గాల్లో ఇంజక్షన్లు విక్రయించే వారిని సంప్రదించి ఒక్కోటి రూ.35వేల చొప్పున కొనుగోలు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చి ప్రయత్నించిన ఓ వ్యక్తి ఒక్కోదానికి ఏకంగా రూ.60వేలు చెల్లించినట్లు తెలిసింది.

అన్ని మందుల పరిస్థితీ ఇంతే..

ఇంత ఖర్చుచేసినా దొరకడమే అదృష్టం అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ‘ఇవి ఏ మాత్రం పని చేస్తాయో తెలియదు, ఆశతో కొని వినియోగించక తప్పడం లేదు. ఎక్కువ ధర పెట్టి కొని వాడినా మా కుటుంబ సభ్యుడి ప్రాణం దక్కించుకోలేకపోయామ’ని విశ్రాంత ఇంజినీరు ఒకరు తెలిపారు. ఇదొక్కటే కాదు కరోనా బారిన పడి ప్రాణాలు దక్కించుకోవడానికి అత్యవసరంగా అవసరమైన అన్ని మందుల పరిస్థితీ ఇలాగే ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులకు నేరుగా వైద్యారోగ్యశాఖ సరఫరా చేస్తుంది. కొందరు రాజకీయనాయకులు, పలుకుబడి కలిగిన వారి ఒత్తిడితో అక్కడక్కడా పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. అయినా బ్లాక్‌మార్కెట్‌ దందా ఆగడం లేదు.

  • రెమ్‌డెసివిర్‌ నల్లబజార్లో విక్రయిస్తున్న ఓ ఔషధ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులతో పాటు మొత్తం నలుగురు నిందితులను బేగంపేట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరు ఒక్కోదాన్ని రూ.35 వేలకు అమ్ముతుండగా పట్టుకుని 12 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.
  • ఒక్కో ఇంజక్షన్‌ను రూ.20 నుంచి రూ.25వేలకు నల్లబజార్లో అమ్ముతుండగా కరీంనగర్‌ పోలీసులు గత శుక్రవారం నలుగురిని అరెస్టు చేశారు.
  • కరోనా రోగుల కుటుంబ సభ్యులకు ఈ మందులు అమ్ముతుండగా పోలీసులు కాపుకాసి ముర్గి మార్కెట్‌ వద్ద ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
  • హైదరాబాద్‌ పశ్చిమ మండలం పోలీసులు గత గురువారం రెమ్‌డెసివిర్‌ను నల్లబజార్లో అమ్ముతున్న ఓ మందుల దుకాణం యజమానిని పట్టుకున్నారు.

మరెన్నో మందులు కూడా..

కరోనా చికిత్సలో ఉపయోగపడే ఇంకా అనేక ముఖ్యమైన మందులను కూడా నల్లబజార్లో విక్రయిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స కోసం వాడే కొవిఫర్‌ వంటి మందు విలువ రూ.సుమారు 50 వేలు ఉంటే నల్లబజార్లో దీని విలువ రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ ఉంది. ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్న వారికి ఈ మందులు వాడుతుంటారు. ఇప్పుడు ఇవి కూడా దుకాణాల్లో దొరకడంలేదు. పలువురు ముఠాలుగా ఏర్పడి నల్లబజార్లో నాలుగైదు రెట్ల అధిక దరలకు విక్రయిస్తున్నారు. అలానే ప్రజల భయాన్ని దృష్టిలో ఉంచుకొని సైబర్‌ మాయగాళ్లు కూడా రంగంలోకి దిగారు. ఇటీవల దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి వాట్సప్‌ సందేశం వచ్చింది. తాము ఓ సేవా సంస్థ నుంచి మాట్లాడుతున్నామని, కరోనా మందులు తక్కువ ధరకే ఇస్తామని, ఆక్సిజన్‌ కూడా ఇంటికి సరఫరా చేస్తామంటూ వల విసిరారు. నలుగురికీ ఉపయోగపడుతుంది కదా అని దాన్ని ఆ యువకుడు తనకు తెలిసిన గ్రూపుల్లో పోస్టు చేశారు. అవసరమైన వారు ఆక్సిజన్‌ కోసం సంప్రదించగానే సిలిండర్లకు డిపాజిట్‌ చేయాలని చెప్పడంతో అనుమానం వచ్చింది. ఆ తర్వాత విచారిస్తే అదంతా మోసమని తేలింది. వ్యాక్సిన్‌ అమ్ముతామని కూడా అనేక మంది ఆన్‌లైన్లో మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా నల్లబజార్లో కరోనా మందులు అమ్ముతున్న ముఠాల భరతం పట్టడంతోపాటు సైబర్‌ నేరగాళ్ళ వలలో పడకుండా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే తమ దృష్టికి తీసుకొని రావాలని పోలీసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రానికి పొంచి ఉన్న ఆక్సిజన్ సమస్య!

ABOUT THE AUTHOR

...view details