ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

క్రియాశీల కేసుల్లో కాస్త తగ్గుదల.. అదుపులోకి రాని మరణాలు - corona deaths in India updates

దేశంలో వరుసగా రెండోరోజు కొత్త కరోనా కేసులకంటే కోలుకున్న వారిసంఖ్య అధికంగా నమోదైంది. దీంతో క్రియాశీల కేసులు తగ్గాయి. గత ఒక్కరోజులో 92,605 కొత్త కేసులొచ్చాయి. 94,612 మంది కోలుకొని ఇంటికెళ్లారు. 1,133 మంది మరణించారు. దీంతో  క్రియాశీల కేసుల్లో 3,140 మేర తరుగుదల నమోదైంది.

corona deaths in India
corona deaths in India

By

Published : Sep 21, 2020, 7:31 AM IST

గత 24 గంటల్లో కేరళ, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లలో ఇదివరకటి కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో రోజువారీ సరళికంటే తరుగుదల కనిపించింది. కేసులు, కోలుకున్నవారిలో రోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా మరణాలు మాత్రం యథాతథంగా సాగుతూపోతున్నాయి. వరుసగా 19వ రోజు వెయ్యికిపైగా మరణాలు సంభవించాయి. ఈనెలలో ఇప్పటివరకు రోజుకు సగటున 1,114 మంది చొప్పున 22,283 మంది చనిపోయారు. మొత్తం మరణాల్లో 25.68% ఈ నెలలోనే చోటుచేసుకున్నాయి. ఈనెలలో ఇప్పటివరకు రోజుకు 76,412 మంది చొప్పున 15,28,242 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారిలో 35.51% మంది ఈ నెలలోనే కోలుకొని ఇంటికెళ్లారు. ఇవి రెండూ ఈనెల పరిణామాల్లో తీపి చేదుల్లా కనిపిస్తున్నాయి.

లెక్కల్లో తేడాలు

దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పరీక్షల విషయంలో రాష్ట్రాలు చెబుతున్న లెక్కలు, ఐసీఎంఆర్‌ చెబుతున్న లెక్కల్లో తేడాలు కనిపిస్తున్నాయి. గత రెండురోజుల్లో కనిపించిన ఈ హెచ్చుతగ్గులు అయోమయాన్ని సృష్టించాయి. ఈనెల 17వ తేదీన రాష్ట్రాలు 11.51 లక్షల పరీక్షలు నిర్వహించినట్లు ప్రకటించగా, ఐసీఎంఆర్‌ మాత్రం 10.06 లక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. 18వ తేదీన రాష్ట్రాలు 12.4 లక్షలు నిర్వహించినట్లు పేర్కొనగా, ఐసీఎంఆర్‌ మాత్రం 8.82 లక్షలు మాత్రమే చేపట్టినట్లు చెప్పింది. 19వ తేదీన (శనివారం) ఇది వరకు ఎన్నడూలేని విధంగా 12,06,806 పరీక్షలు నిర్వహించినట్లు ప్రకటించింది.

క్రితం రోజు రాష్ట్రాలు చెప్పిన లెక్కల్లోంచి తీసుకున్నవా, లేదంటే కొత్తగా చేసినవా అన్నది తెలియరాలేదు. ఇలా రాష్ట్రాలు, ఐసీఎంఆర్‌ లెక్కల మధ్య తేడా రావడంవల్ల పరీక్షలపై కేంద్రీకృత పర్యవేక్షణ ఉందా? లేదా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. మరోవైపు శనివారం ఒక్క రోజునే 12 లక్షలకుపైగా పరీక్షలు నిర్వహించడం రికార్డని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం 6.36 కోట్ల పరీక్షలు నిర్వహించినట్టయిందని తెలిపింది. గత తొమ్మిది రోజుల్లోనే కోటి పరీక్షలు జరిపినట్టు పేర్కొంది. పెద్దసంఖ్యలో పరీక్షలు జరుపుతున్నందునే కేసులు కూడా పెరుగుతున్నాయని తెలిపింది.

ఇదీ చదవండి :కరోనా చెరలో పల్లె.. పట్టణాల కంటే ఎక్కువ కేసులు

ABOUT THE AUTHOR

...view details