తెలంగాణలోని సూర్యాపేటలో ఓ మహిళ అష్టాచమ్మా ఆడటం ద్వారా 31 మందికి, విజయవాడలో లారీ డ్రైవర్ పేకాట ఆడటం వల్ల అనేక మందికి కరోనా సోకినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నలుగురైదుగురు కలిసి ఆడే ఆటలకు పోలీసులు అభ్యంతరం చెబుతున్నారు. అష్టాచమ్మా ఆడే వారిలో ఒకరికి కరోనా ఉన్నా వారు తుమ్మినప్పుడో, దగ్గినప్పుడో చుట్టూ కూర్చున్న మిగతా వారికి వైరస్ సోకే అవకాశం ఉంటుంది. అలాగే ఆడేందుకు వాడే చింత పిక్కలు, పాచికలను అంతా పట్టుకుంటారు. ఇక్కడా వ్యాధి ఉన్న వారి ద్వారా మిగతా అందరికీ సోకే అవకాశముంటుంది.
క్యారమ్స్, పేకాట, షటిల్, క్రికెట్, కబడ్డీలదీ ఇదే పరిస్థితి. కరోనా సమయంలో ఇలాంటి ఆటలు ప్రమాదకరమని పోలీసులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి ఆటలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రమే ఆడుకునేందుకు కొంత వెసులుబాటు ఉన్నా చుట్టుపక్కల వారితో కలిసి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆడవద్దంటున్నారు. ఈ మేరకు కాలనీల పెద్దల్ని పిలిపించి పరిస్థితి వివరిస్తున్నారు. ఇంట్లో ఒక వ్యక్తికి కరోనా సోకితే అది మిగతా వారికీ వ్యాపించే అవకాశం ఎక్కువ కాబట్టి ముందు జాగ్రత్తగా కుటుంబ సభ్యులు కూడా వ్యక్తిగత దూరం పాటించాలని కోరుతున్నారు.