గుంటూరు జిల్లాలో కరోనా కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మూడురోజులుగా రెండు వందలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. బుధవారం 202 పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఒక్క గుంటూరులోనే 97 కేసులు బయటపడ్డాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2881కి చేరింది. తాడేపల్లిలో 31, నరసరావుపేటలో 23, తెనాలిలో 15 కేసులు నమోదయ్యాయి. మాచర్ల, మంగళగిరిలో ఐదేసి కేసులు, సత్తెనపల్లిలో 4, చిలకలూరిపేటలో 3 కేసులు చొప్పున బయటపడ్డాయి. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎమ్వో కరోనా బారిన పడి మృతిచెందారు. తెనాలి మున్సిపల్ కమిషనర్ సైతం కరోనా బారినపడ్డారు. గుంటూరు నగరంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో కాంటాక్ట్ ట్రేసింగ్‌కు సంబంధిత సచివాలయం పరిధిలోనే ప్రత్యేక బృందాల ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశించారు.
కడచూపు దక్కక..
గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన ఓ కుటుంబాన్ని కరోనా ఛిన్నాభిన్నం చేసింది. ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక వ్యక్తి ప్రకాశం జిల్లాలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయనకు వైరస్ సోకింది. అతడి సోదరడికీ లక్షణాలు కనిపించాయి. ఇద్దరూ ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చేరారు. మరో సోదరుడితో పాటు కుటుంబ సభ్యుల నలుగురిని గుంటూరు ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. ఇంతలో ఐసోలేషన్‌లో సోదరుడు గుండెపోటుతో మృతిచెందాడు. మృతదేహం తీసుకొచ్చేందుకు స్థానికంగా ఎవరూ లేక అక్కడే ఖననం చేశారు. ఈ విషాదంలో ఉండగానే రిమ్స్‌లో చికిత్స పొందుతున్న మరో సోదరుడు మృతిచెందారు. కన్నవారికి, కట్టుకున్న వారికి కడచూపు దక్కలేదు. మరో సోదరుడు ఇంకా కోలుకోలేదు.