కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ గ్రేటర్‌ను వణికిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా సోమవారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 79 పాజిటివ్ కేసులు నమోదు కాగా... అన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం ప్రజల్ని ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 1,275 మంది మహమ్మారి బారిన పడగా.. 730కి పైగా కేసులు గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. గత పది రోజులుగా నమోదైన కేసుల్లో 90 శాతం భాగ్యనగర పరిధిలోనే ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు స్పష్టం చేశాయి.
తగ్గుతున్నాయి అనుకునేలోపే..
హైదరాబాద్‌లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో మలక్‌పేట్ గంజ్ మార్కెట్లో ముగ్గురు వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకిన విషయం వెలుగు చూసింది. ఫలితంగా కొన్ని కుటుంబాల్లోనే వ్యాధి వేగంగా వ్యాపించి బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
వనస్థలిపురం, ఎల్బీ నగర్, మలక్‌పేట, జియాగూడ ప్రాంతాల్లోనూ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు గత కొంతకాలంగా కొవిడ్ లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేసిన సర్కారు... గత రెండు మూడు రోజులుగా పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్లనూ పూర్తి స్థాయిలో పరీక్షిస్తున్నందున కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది.