తెలంగాణలోని కరోనా వైరస్ విజృంభన జిల్లాలను హడలెత్తిస్తోంది. పట్టణాలు, గ్రామాల్లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పెద్దసంఖ్యలో కేసులు పెరుగుతుండటంతో పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్ విధిస్తున్నారు. GHMCలో అత్యధిక కొవిడ్ కేసులు నమోదవుతున్నా.... మిగిలిన జిల్లాల్లోనూ బాధితుల సంఖ్య వాయువేగంతో విస్తరిస్తోంది. అధిక జిల్లాల్లో వారంలోనే రెట్టింపు నుంచి అయిదింతలు కేసులు పెరిగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో... రంగారెడ్డి, మేడ్చల్ కంటే అధికంగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. తక్కువ కేసులు నమోదైన జిల్లాల్లోనూ..... అదే రీతిలో పెరుగుదల కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో పరీక్షలు చేసిన ప్రతి వెయ్యి మందిలో 200 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. 15 రోజుల క్రితం 23 పాజిటివ్‌లు నమోదు కాగా... ఇప్పుడా సంఖ్య 364కి పెరిగింది. మెదక్‌లో ఏప్రిల్‌లోనే అధికంగా 2వేల870 మందికి వైరస్ సోకింది. సిద్దిపేటలో 3 వేల కేసులు నమోదయ్యాయి.
ఎన్నికల ప్రచార ప్రభావం
నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారం ప్రభావంతో... కొవిడ్ వ్యాప్తి బాగా పెరిగింది. నియోజకవర్గ పరిధిలోనే ఏప్రిల్‌లో 700 మందికిపైగా వైరస్ బారినపడ్డారు. యాదాద్రి జిల్లాలో రోజుకు 200 నుంచి 250 కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్‌లో యాదాద్రి జిల్లాలో 3,200, నల్గొండ జిల్లాలో 3,600 కేసులు వెలుగుచూశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసులు నిర్ధరణఅవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో 30 నుంచి 40 మంది బాధితులున్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో 20 రోజుల్లోనే 372 కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా 12 గ్రామాల్లో... స్వచ్ఛంద లాక్‌డౌన్ విధించారు. జగిత్యాల జిల్లాల్లో మొత్తం 80కి పైగా గ్రామాల్లో స్వచ్ఛందంగా ఆంక్షలు విధించుకున్నారు.