ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పాఠశాలలు, ట్యూషన్లలో కరోనా వ్యాప్తి - ఏపీలో కరోనా కేసుల వివరాలు

కరోనా వైరస్‌ కారణంగా గత కొద్ది నెలల నుంచి పాఠశాలలు, కళాశాలల మూతపడ్డాయి. అందువల్ల పిల్లలు పెద్దగా కరోనా బారిన పడలేదు. పిల్లల్లో వ్యాధి లక్షణాలు లేకపోవడంతో వారికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలూ అంతగా చేయలేదు. కానీ ఇటీవల పాఠాల్లో అనుమానాలు తీర్చుకోడానికి గుంటూరు, విజయనగరం జిల్లాల్లో స్కూళ్లకు వెళ్లిన కొందరు పిల్లలు వైరస్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

schools
schools

By

Published : Oct 6, 2020, 8:21 AM IST

పిల్లలకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం, చేతులు కడుక్కోవడంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని పిల్లల వైద్యులు చెబుతున్నారు. తొమ్మిది, ఆ పై తరగతుల విద్యార్థులు సందేహాల నివృత్తికి సెప్టెంబరు 21 నుంచి పాఠశాలలకు వెళ్లొచ్చని ప్రభుత్వం తెలిపింది. దీంతో 9, 10 తరగతుల విద్యార్థులు ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా గంట్యాడ, దత్తి ఉన్నత పాఠశాలలల్లో 27 మంది విద్యార్థులకు వైరస్‌ సోకినట్లు గుర్తించారు. గుంటూరు జిల్లా భట్లూరుకు చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లినప్పుడు పరీక్షించగా కరోనా ఉన్నట్లు తేలింది. ఆమె కాంటాక్టులను గుర్తించే క్రమంలో భర్త, ఆయన వద్ద ట్యూషన్‌ కోసం వెళ్లిన విద్యార్థులను పరీక్షిస్తే.. 17 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. అమెరికాలో పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాక దాదాపు 97 వేల మంది పిల్లలకు కరోనా సోకింది.

లక్షణాలు లేకపోవడంతో ముప్పు

కరోనా వైరస్‌ బారినపడినా.. చిన్నారులు, యువతలో అనుమానిత లక్షణాలు తక్కువ. పిల్లల ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్‌ను ఆకర్షించే ఏస్‌-2 ఎంజైమ్‌ తక్కువగా ఉంటోంది. దీంతో లక్షణాలు అంతగా ఉండట్లేదు. 15 ఏళ్లలోపు పిల్లలు తరచూ సాధారణ వైరస్‌ల బారినపడుతూ జలుబు, దగ్గుతో ఇబ్బందిపడతారు. దీనివల్ల వారిలో యాంటీబాడీస్‌ తయారయ్యి, కొవిడ్‌తోనూ పోరాడుతాయని కొందరు వైద్యులు చెబుతున్నారు.

గుంపులుగా కూర్చోబెట్టకూడదు

చిన్నపిల్లలు ఎక్కువగా బయట తిరగకపోవడంతో వీరికి వైరస్‌ అంతగా సోకలేదు. ఉద్యోగాల కోసం బయట తిరిగే యువకుల్లో కొందరు కరోనా బారిన పడుతున్నారు. అయితే, ఇప్పుడు పాఠాలు చెప్పించుకోడానికి ఉపాధ్యాయుల వద్దకు వెళ్లినవారిలో కొందరికి ఈ వైరస్‌ సోకడం చర్చకు దారితీస్తోంది. విజయనగరం జిల్లాలో గంట్యాడ, దత్తి గ్రామీణ ప్రాంతాలు. అక్కడి పాఠశాలలకు పిల్లలు దూరప్రాంతాల నుంచి నడిచి, సైకిళ్ల మీద వస్తారు. అప్పుడు వారంతా కలిసే ఉంటారు. వారికి మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా మధ్యాహ్న భోజన సమయం, ఆటల సమయాల్లో భౌతికదూరం పాటించడం లేదని అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఒక తరగతిలో పిల్లలందరినీ ఒకేసారి పాఠశాలకు రప్పించడం కాకుండా.. సగం మందిని ఒక రోజు, మరో సగం మందిని మరోరోజు పిలిస్తే మంచిదని, అప్పుడు వారిని దూరంగా కూర్చోబెట్టేందుకు వీలుంటుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒకరు సూచించారు. పిల్లలకూ పెద్దసంఖ్యలో నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు.

  • కొందరు పిల్లల్లో కరోనా మొదటి రెండువారాల్లో పెద్దగా ప్రభావం చూపించపోయినా 3, 4 వారాల్లో తీవ్రమవుతోంది. మొదట్లో లక్షణాలు లేకపోవడంతో తల్లిదండ్రులూ వారిని గుర్తించలేకపోతున్నారు.
  • తీవ్రజ్వరం, ఒళ్లంతా దద్దుర్లు, కడుపునొప్పి వంటి లక్షణాలున్న చిన్నారులను జాగ్రత్తగా పరీక్షించాలని వైద్యులు సూచిస్తున్నారు.
  • సాధారణంగా ఐదేళ్ల వయసు నిండేవరకూ రక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందదు. అందువల్లే వీరికి అంటువ్యాధులు సోకుతాయి. కొవిడ్‌ వైరస్‌ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది.
    పాఠశాలలు, ట్యూషన్లలో కరోనా వ్యాప్తి..

ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 17వ తేదీ మధ్య నమోదైన వైరస్‌ కేసుల్లో వయసుల వారీగా పరిశీలిస్తే...

రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 1,000 కేసులు పరిశీలిస్తే.. తొమ్మిదేళ్లలోపు చిన్నారుల్లో లక్షణాలున్న వారు 0.37%, లక్షణాలు లేనివారు 3.27% మంది ఉన్నారు. 10-19 ఏళ్ల మధ్యవారు 4.04% మందికి లక్షణాలుండగా, 9.25% మందికి లేవు.

మానసికంగా సంసిద్ధుల్ని చేయాలి

9, 10 తరగతుల విద్యార్థులు మరీ చిన్న పిల్లలూ కారు, యువకులూ కారు. వారు లక్షణాలుంటే చెప్పగలరు. రుచి, వాసన తెలియకపోయినా, జలుబు, దగ్గు, జ్వరం వచ్చినా పెద్దవారికి చెప్పాలని వారికి వివరించాలి. వైరస్‌ వ్యాప్తి నిరోధించాలంటే పిల్లల్లో అవగాహన తీసుకురావడమే ముఖ్యం. పిల్లలకు కరోనా సోకితే బహుళ అవయవ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. శ్వాసలక్షణాలే కాకుండా విరేచనాలు, వాంతులు వంటి జీర్ణకోశ లక్షణాలూ ఉండొచ్చు. నీరసం, అచేతనం వంటి పరిణామాలు కనిపిస్తాయి. పొడి దగ్గు ఉంటుంది. గొంతులో గరగర ఉంటుంది. శ్వాసనాళాల్లో అసౌకర్యంగా ఉంటుంది. వీటిని గుర్తించాలి.-ప్రొఫెసర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌, పిల్లల వైద్య నిపుణులు, విజయవాడ జీజీహెచ్‌

ఇదీ చదవండి:నేటి నుంచి రాజధాని వ్యాజ్యాలపై రోజువారీ విచారణ

ABOUT THE AUTHOR

...view details