గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ ఉద్ధృతి రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మే 8 వరకు 1.2లక్షల మంది వైరస్ బారినపడ్డారు. జిల్లాలో పాజిటివిటీ రేటు 7.47 శాతంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్, మే మొదటి వారంలోనే అత్యధికంగా 40,382 కేసులు నమోదు కావడం జిల్లాలో వైరస్ తీవ్రతను తెలియజేస్తోంది. ఏప్రిల్‌లో 26,878, మేలో 8 రోజుల్లో మరో 13,504 కేసులు వచ్చాయి. 2020 మార్చి నుంచి 2021 మే 8వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 16.17 లక్షల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 16.10 లక్షల మంది ఫలితాలు వెల్లడించారు. 14.9 లక్షల మందికి వైరస్ లేదని (నెగెటివ్ 92.53 శాతం)గా తేలగా.. 1,20,303 మందికి(7.47%) పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో 1,01,845 (84.66 శాతం) మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం 17,627 క్రియాశీల కేసులు ఉన్నాయి. మొత్తం 831 మంది వైరస్ బారిన పడి చనిపోయారు.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు ముమ్మరం
వ్యాధి తీవ్రత బాగా ఉన్న జిల్లాల్లో గుంటూరు ముందంజలో ఉంది. దీంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలను యంత్రాంగం వేగవంతం చేసింది. గత వారం సగటున రోజుకు 4-5 వేల పరీక్షలు చేశారు. ఈ వారం రోజుల్లో సగటున రోజుకు 6వేల నుంచి 7వేల మందికి పరీక్షలు చేశారు. ప్రతి సచివాలయం పరిధిలో పరీక్షలు చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్, ట్రూనాట్, యాంటీజెన్, రాపిడ్ టెస్టులు చేస్తున్నారు. పరీక్షలు చేయగానే అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఫలితాలు వెలువడే వరకు ట్రైఏజ్ సెంటర్లలో ఉంచి వ్యాధి విస్తరించకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు పరీక్షల ఫలితాల వెల్లడిలో జాప్యం చోటుచేసుకోకుండా ఉండడానికి ఆరు ప్రైవేటు ల్యాబ్‌లకు ఫలితాలు విశ్లేషించేలా అనుమతులు మంజూరు చేశారు. దీంతో ఫలితాలు సైతం వేగంగా వస్తున్నాయి. పది రోజుల క్రితం నమూనాలు సేకరించిన నాలుగైదు రోజులకు ఫలితం వచ్చేది. ప్రస్తుతం 48 గంటల్లోనే ఫలితాలు వస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలోని వీడీఆర్‌ఎల్ ల్యాబ్‌లో ఇంకా 5వేలకు పైగా పరీక్షల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇక్కడ కూడా సిబ్బందిని పెంచి సాధ్యమైనంత త్వరగా ఫలితాలు వెల్లడించడానికి యంత్రాంగం చర్యలు చేపట్టింది.