పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. పట్టణాల నుంచి పల్లెలకు రాకపోకలు పెరగడం, మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని విస్మరించడం వంటి తదితర కారణాలు వైరస్ పెరిగేందుకు దోహదపడుతున్నాయి. ‘గ్రామాలలో రచ్చబండ ముచ్చట్లు మానడం లేదు. ఒక రచ్చబండపై పది మంది కూర్చుంటే ఐదారుగురు మాత్రమే మాస్కులు ధరిస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్యం వల్లే ముప్పు పెరుగుతోంది’ అని కృష్ణా జిల్లా వెలగలేరు పీహెచ్‌సీ వైద్యుడు కిషోర్ కుమార్ పేర్కొన్నారు. పలుచోట్ల మాస్కులు ధరించేవారిని ఆటపట్టించే వారూ ఉన్నారన్నారు.
- అనుమానిత లక్షణాలు లేని వారిలోనూ వైరస్ ఉంటోంది. ఇలాంటి వారివల్ల పల్లెల్లో కేసులు పెరుగుతున్నాయి. లక్షణాలు కనిపించినప్పుడు కొందరు వెంటనే పరీక్షలు చేయించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. లక్షణాలు ముదిరిన అనంతరం ఆసుపత్రులకు వెళ్లడంవల్ల ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతున్నాయని గుంటూరు జిల్లా వైద్యుడు ఒకరు పేర్కొన్నారు.
- పొల్లాల్లో పనిచేసే రైతులు, కూలీలూ దాదాపుగా మాస్కులు ధరించడంలేదని.. భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నారని..మాస్కును వారు అవరోధంగా భావిస్తున్నారని ఇదే వైరస్ వ్యాప్తికి కారణమవుతోందని ప్రభుత్వ వైద్యులు పేర్కొంటున్నారు. విద్యావంతులు ఎక్కువగా ఉండే పట్టణాలు/నగరాల్లో సైతం కొందరు యువకులు మాస్కులు పెట్టుకోవడం లేదని విజయవాడ జీజీహెచ్ వైద్యుడొకరు వ్యాఖ్యానించారు.
- ఆగస్టు ఒకటో తేదీకి ముందు రాష్ట్ర వ్యాప్తంగా 4,512 కట్టడి ప్రాంతాలు(క్లస్టర్లు) ఉన్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు అదనంగా 1,551 జతయ్యాయి. పాత ప్రాంతాల్లో 1,55,949 కేసులు ఉంటే....కొత్త కట్టడి ప్రాంతాల్లో 10,607 కేసులు నమోదయ్యాయి.
- పట్టణాల్లో ఉండే కొవిడ్ ఆసుపత్రులకు గ్రామాల్లో ఉండే బాధితులను సకాలంలో చేర్చడంలో గంటలకొద్దీ సమయం అనివార్యం అవుతుండటంతో పలువురు ప్రాణాలు విడుస్తున్నారు.
- నెల్లూరు జిల్లాలోని పట్టణాలకు చెందిన వారిలో గరిష్ఠంగా ఆగస్టు 1 నుంచి 19 మధ్య 71 మంది మృతిచెందారు.
- పశ్చిమగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు 55 మంది ప్రాణాలు కోల్పోయారు.