రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 64,550 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,557 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్ మహమ్మారి బారినపడి మరో 18 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,825కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20లక్షల 12వేల 123 మంది వైరస్ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 1,213 మంది బాధితులు కోలుకోవడం ద్వారా వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19లక్షల 83వేల 119కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,179 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2 కోట్ల 65 లక్షల 35 వేల 822 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. కరోనాతో కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా.. చిత్తూరు జిల్లాలో 255, తూ.గో.జిల్లాలో 232, ప.గో. జిల్లాలో 212, నెల్లూరు జిల్లాలో 164 కరోనా కేసులు నమోదైనట్లు తాజా హెల్త్ బులిటెన్లో పేర్కొంది.
జాతీయ స్థాయిలో...
భారత్లో కొవిడ్ కేసులు (Corona virus India) వరుసగా నాలుగో రోజూ 40 వేలకుపైగా నమోదయ్యాయి. కొత్తగా 45,083 మంది వైరస్(Covid-19) బారినపడ్డారు. మరో 460 మంది మరణించారు. 35,840 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం రికవరీ రేటు 97.53 శాతంగా ఉంది. శనివారం ఒక్కరోజే 17 లక్షల 55 వేలకుపైగా పరీక్షలు జరిపినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. మొత్తం టెస్టుల సంఖ్య 51 కోట్ల 86 లక్షలు దాటింది. కరోనా వ్యాక్సినేషన్లో (COVID vaccination) భారత్ దూసుకెళ్తోంది. శనివారం 73 లక్షలకుపైగా టీకా డోసుల్ని లబ్ధిదారులకు అందించారు అధికారులు. మొత్తంగా ఇప్పటివరకు 63 కోట్ల 9 లక్షల 17 వేల 927 టీకా డోసులను పంపిణీ చేసింది కేంద్రం.