తెలంగాణలో రెండు రోజులుగా కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచి లక్షకు పైగా చేస్తున్నారు. పరీక్షల సంఖ్యతో పాటు.. రాష్ట్రంలో మహమ్మారి సోకిన వారి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో లక్షా 11 వేల 726 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... అందులో 2909 మందికి వైరస్ సోకినట్టు ఆరోగ్య శాఖ గుర్తించింది. ఒకే రోజులో ఇంత భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావటం సుమారు ఆరు నెలల కాలంలో ఇదే మొదటి సారి కావటం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. మరో 4533మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఆరుగురు బలి...
ఇక తాజాగా వచ్చిన కేసులతో కలిపి ఇప్పటివరకు మహమ్మారి సోకిన వారి సంఖ్య 324091కి పెరిగింది. మరో 584 మంది కోలుకోగా... మొత్తం 304548 మంది కరోనా నుంచి బయటపడ్డారు. తాజాగా మహమ్మారి ఆరుగురిని బలి తీసుకోగా... కరోనా మరణాలు 1752కి పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 17791యాక్టివ్ కేసులు ఉండగా... అందులో 11వేల 9495మంది హోం ఆసోలేషన్లో ఉన్నారు.